China cyber attack on India: భారత్‌పై చైనా సైబర్ దాడి చేసినట్లు సంచలన విషయం బయటికి వచ్చింది. లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదం జరుగుతున్న సమయంలోనే ఈ హ్యాకింగ్ జరిగినట్లు రికార్డెడ్ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ వెల్లడించింది. భారత పవర్ గ్రిడ్‌లోకి చొరబడిన చైనా హ్యాకర్లు కీలక సమాచారాన్ని అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెడ్‌ఎకో గ్రూప్ వీటిని హ్యాక్ చేయగా... తాజాగా డబ్బెడ్ టాగ్-32 అనే గ్రూపు పేరు బయటకొచ్చింది. చైనాకు చెందిన డబ్బెడ్ టాగ్-32 హ్యాకర్లు ఉత్తర భారత్‌లోని విద్యుత్తు సరఫరాకు చెందిన 7 లోడ్ డిస్పాచ్ సెంటర్లు 'ఎస్ఎల్సీడీ'లను హ్యాక్ చేశారు. ఇవి చైనా సరిహద్దుల్లో ఉండే లద్దాఖ్ ప్రాంతంలోని పవర్ గ్రిడ్ నియంత్రణకు, విద్యుత్ సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్నాయి. చైనా ప్రభుత్వ హ్యాకర్లు భారత్‌లోని పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని గూఢచర్యానికి పాల్పడుతున్నారని రికార్డెడ్ ఫ్యూచర్ తెలిపింది. మౌలిక సదుపాయాల సమాచారాన్ని సేకరించి.. భవిష్యత్తు వ్యూహాలకు వాడుకునే అవకాశం ఉందని పేర్కొంది. దీంతోపాటు హ్యాకర్లు ఇండియన్ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థను, ఓ మల్టీనేషనల్ కంపెనీకి చెందిన అనుబంధ రవాణా సంస్థను కూడా హ్యాక్ చేసినట్లు వెల్లడించింది.
China cyber attack Ladakh Power grid: హ్యాకింగ్ కోసం డబ్బెడ్ టాగ్-32 గ్రూపు షాడోపాడ్ అనే ఓ అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను వాడినట్లు తెలిసింది. ఈ హ్యాకింగ్ గ్రూపు గతంలో చైనాతో కలిసి పనిచేసిందని రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ వెల్లడించింది. దక్షిణకొరియా, తైవాన్‌లలో తయారు చేసిన పరికరాలను హ్యాకర్లు వాడినట్లు తెలిపింది. కొన్నేళ్లుగా భారత్‌పై హ్యాకింగ్‌కు పాల్పడుతోందని ఆరోపణలున్నా తోసిపుచ్చుతూనే ఉన్న చైనా.... ఈసారి స్పందించలేదు. భారత్‌లోని ఓ నౌకాశ్రయాన్ని 2021లో చైనా ప్రభుత్వాధీనంలోని రెడ్ ఎకో గ్రూప్ హ్యాక్ చేసింది. 2 నౌకాశ్రయాలు సహా 10 సంస్థలపై హ్యాకర్లు గురిపెట్టినట్టు గతేడాది ఫిబ్రవరి 10న గుర్తించినట్లు చెప్పింది. ఫిబ్రవరి 28 నాటికి కూడా కొన్నిసంస్థల్లోకి సమాచారం వెళ్తుండడాన్ని గమనించామని వెల్లడించింది.2021 మే లో ఎయిరిండియాపై జరిగిన సైబర్‌దాడిలో వీరి హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 45లక్షలమంది ప్రయాణికుల వివరాలను తస్కరించినట్లు సింగపూర్‌కు చెందిన గ్రూప్-ఐబీ బహిర్గతం చేసింది. ప్రపంచ విమానయానరంగంపై చైనా నిఘా పెట్టిందని.. దానిలో భాగంగానే ఈ హ్యాకింగ్ జరిగిందని వెల్లడించింది. చైనా ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తున్న ఏపీటీ-41 అనే హ్యకింగ్ బృందం హస్తం ఇందులో ఉందని ఈ ముఠా అమెరికాలో దాదాపు 100 సంస్థల నుంచి సమాచారం తస్కరించినట్లు పేర్కొంది.
ప్రయత్నించారు.. కానీ...: భారత్‌లోని పవర్ గ్రిడ్లపై చైనా సైబర్ దాడి వ్యవహారంపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పందించారు. లద్దాఖ్ సమీపంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలే లక్ష్యంగా చైనా హ్యాకర్లు రెండుసార్లు సైబర్ దాడికి యత్నించారని, అయితే వారు సఫలం కాలేదని స్పష్టం చేశారు. సైబర్ దాడుల్ని ఎదుర్కొనేలా రక్షణ వ్యవస్థల్ని ఇప్పటికే కట్టుదిట్టం చేసినట్లు వివరించారు ఆర్కే సింగ్.
ఇదీ చదవండి: రష్యాకు దీటుగా ఉక్రెయిన్ దాడులు.. యుద్ధనౌక ధ్వంసం!