కఠిన కొవిడ్ నిబంధనలతో మూడేళ్లుగా ప్రపంచం నుంచి తనను తాను వేరు చేసుకున్న చైనా యధాస్థితికి వచ్చేందుకు సిద్ధపడింది. ఆదివారం నుంచి అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ప్రయాణాలు, వ్యాపారాలు యధావిధిగా కొనసాగుతాయని శనివారం ప్రకటించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వివిధ దేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్, కొవిడ్ పరీక్షలు ఉండవు.
అంతేకాకుండా కొవిడ్‌ను అతి ప్రమాదకరమైన వ్యాధుల జాబితా నుంచి తొలగించి, తక్కువ ప్రమాదకరమైన వ్యాధిగా ప్రకటించింది. ఈ చర్యలపై స్వదేశంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నప్పటికీ అంతర్జాతీయంగా ఆందోళన కనపడుతోంది. జనవరి 22న చైనా వాసులు జరుపుకొనే ప్రధాన పండగకు దేశీయంగా కోట్ల మంది ప్రయాణాలు చేస్తారు. ఈ నేపథ్యంలో నిబంధనల ఎత్తివేత ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని అంతర్జాతీయ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అరెస్టు అయిన వారికి ఉపశమనం..
క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘనను ఇకపై క్రిమినల్ చర్యగా పరిగణించవద్దని శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆందోళనల్లో పాల్గొని అరెస్టు అయిన వారిని విడుదల చేసి, స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడిచిపెట్టాలని తెలిపింది. అయినప్పటికీ వైద్య నిపుణుల్ని, ఆసుపత్రి సిబ్బందిని విమర్శించడం, దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలు చేపడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది.
సామాజిక మాధ్యమ ఖాతాలపై వేటు..
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు చేస్తున్న సామాజిక మాధ్యమ ఖాతాలపై వేటు పడింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న 1120 ఖాతాలపై తాత్కాలిక లేదా శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు చైనా సామాజిక మాధ్యమం వీబో వెల్లడించింది. శనివారం బయటపడిన 10,681 కేసులతో కలిపి ఇప్పటి వరకు చైనాలో 4,82,057 కొవిడ్ కేసులు ఉన్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.