China building collapse: ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన చైనా, సెంట్రల్ హునాన్ ప్రావిన్స్‌లో జరిగింది. శిథిలాల్లో 23 మంది చిక్కుకోగా.. మరో 39 మంది ఆచూకీ గల్లంతైందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. భవనం శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు.
వాంగ్చెంగ్ జిల్లాలోని చాంగ్షా నగరంలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో ఉన్న భవనం.. శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలిందని చైనా అధికారిక మీడియా చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్ తెలిపింది. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని, సుమారు 23 మంది చిక్కుకోగా.. మరో 39 మంది ఆచూకీ లేదని పేర్కొంది.
"కూలిపోయిన భవనం యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించాం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అక్రమ, అనుమతులు లేని భవనాల నిర్మాణాలు, పాత భవనాల ఆకృతిని మార్చటం వంటివి చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించాం."
- హాంగ్ మింగ్, అత్యవసర నిర్వహణ మంత్రి
శనివారం ఉదయం.. చైనా కౌన్సిలర్ వాంగ్ యోంగ్ చాంగ్షాను సందర్శించారు. సహాయక, అత్యవసర చర్యలను పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇదీ చూడండి: 'ముందుగా మేమే దాడి చేస్తాం'.. మరోసారి కిమ్ అణు బెదిరింపులు