China 100 kg Social Media Influencer Dead : ప్రస్తుత కాలంలో జిమ్ చేస్తూ కుప్పకూలి చనిపోయిన వారిని ఎంతో మందిని చూశాం. శారీరకంగా దృఢంగా ఉన్నవారు, కండలు తిరిగిన దేహం ఉన్నవారు కూడా అకస్మాత్తుగా కిందపడి మృత్యువాత పడిన ఘటనల గురించి వింటున్నాం. అయితే ఊబకాయంతో బాధపడుతున్న ఓ చైనా యువతి బరువు తగ్గాలని.. అతిగా కసరత్తులు చేసి అస్వస్థతకు గురైంది. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
అసలేం జరిగిందంటే?
చైనాకు చెందిన 21 ఏళ్ల కుయ్‌హువా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. టిక్‌టాక్‌కు చైనీస్ వర్షన్ అయిన డౌయిన్ యాప్‌లో వివిధ వీడియోలు పోస్ట్ చేస్తూ కాస్త ఫేమస్ అయ్యింది. డౌయిన్‌లో ఆమెకు సుమారు పదివేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే రెండు నెలల ముందు రెండు వెయిట్ లాస్ క్యాంపుల్లో చేరిన ఆమె 27 కిలోల బరువు తగ్గింది.
ఎలా అయినా 100 కిలోల బరువు తగ్గాలనే లక్ష్యంతో షాంగ్జీ ప్రావిన్స్‌లోని ఇటీవలే ఓ వెయిట్ లాస్ క్యాంప్‌లో చేరింది. అక్కడ ఆమె అధిక తీవ్రత కలిగిన వర్కౌట్‌లను చేసింది. మంచి వ్యాయామం, విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం.. ఈ మూడు నియమాలు పాటించమని శిబిరం నిర్వాహకులు చెప్పినట్లు సమాచారం. కానీ ఆమె మాత్రం ఆహారాన్ని పరిమితంగా తీసుకుందని వార్తలు వస్తున్నాయి.
అతిగా వర్కౌట్‌లు చేయడం వల్లే
తీవ్రంగా వర్కౌట్లు చేసిన కుయ్‌హువా.. ఇటీవలే అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే కుయ్‌హువా చనిపోవడానికి ప్రధాన కారణం చెప్పలేదు. కానీ ఆమె అతిగా వర్కౌట్‌లు చేయడం వల్లే అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిందని కుటుంబసభ్యులు అంటున్నారు.
100 కిలోలు తగ్గాలని..
తాను 156 కిలోల బరువు నుంచి 100 కిలోలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు కుయ్‌హువా తన పాత వీడియోల్లో తెలిపింది. ఆమె మరణించిన తర్వాత ఆమె అకౌంట్లోని వీడియోలన్నింటినీ డిలీట్ చేసింది డౌయిన్. కుయ్‌హువా మరణాంతరం ఆమె కుటుంబసభ్యులకు.. షాంగ్జీ ప్రావిన్స్‌లోని వెయిట్ లాస్ క్యాంప్ పరిహారం చెల్లించిందని పలు వార్త సంస్థలు తెలిపాయి.
సోషల్‌మీడియాలో ఇదే చర్చ..
కుయ్‌హువా మరణం.. చైనా సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది. బరువు తగ్గించేందుకు వెయిట్ లాస్ క్యాంప్‌లు.. అక్కడి వెళ్లేవారిని కఠినమైన వర్కౌట్లు చేసేలా ఒత్తిడి చేస్తున్నాయని నెటిజన్లు ఆరోపించారు. దీంతో జిమ్ కోచ్‌ల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతి వేగంగా బరువు తగ్గడం.. గుండె మీద ప్రభావం చూపుతుందని అనేక మంది నెటిజన్లు మండిపడుతున్నారు.