Britain Pm Election Result: బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి కన్జర్వేటివ్ పార్టీలో ఎన్నికయ్యేది ఎవరో సోమవారం తేలిపోనుంది. బ్రిటిష్ విదేశాంగశాఖ మంత్రి లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ గెలుపు అవకాశాలు తక్కువేనని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ వేసే బుకీలు సైతం లిజ్ ట్రస్‌వైపే మొగ్గుతున్నారు. వీరిద్దరిలో విజేతను తేల్చడానికి జరిగిన ఎన్నికలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. ఫలితాలను భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటిస్తారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లక్షా 60 వేల మంది క్రియాశీల సభ్యులు.. ఆగస్టు నెల నుంచి పోస్ట్ ద్వారా, ఆన్‌లైన్‌లోనూ ఈ నెల 2వ తేదీ వరకు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
బ్రిటిష్ మాజీ అర్థికమంత్రి అయిన 42 ఏళ్ల రిషి సునాక్.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన నారాయణమూర్తికి స్వయంగా అల్లుడు. టోరీ సభ్యులు 47 ఏళ్ల లిజ్ ట్రస్‌వైపే మొగ్గినట్లు సర్వేలు చెబుతున్నప్పటికీ.. రిషి మాత్రం ఫలితాలపై ఆశాభావంతోనే ఉన్నారు. ప్రచారం సహా మొత్తం ఎన్నిక ప్రక్రియలో తనకు మద్ధతు తెలిపినవారికి రిషి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం చూద్దామంటూ ఆయన ఓటింగ్ ముగిసిన తర్వాత ట్వీట్ చేశారు. పది పాయింట్ల అజెండాతో ఎన్నికల ప్రచారం చేసిన రిషి సునాక్ అక్రమ వలసలు అరికడతానని, నేరాలను అదుపుచేసి.. యూకే వీధులను భద్రంగా మార్చుతానని హామీ ఇచ్చారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు తగిన చర్యలు చేపడతానన్నారు. ఆరు వారాలు చేసిన ప్రచారంలో ప్రతి సెకనను తాను ఆస్వాదించినట్లు రిషి వివరించారు.
బ్రిటిష్ ప్రధానిగా ఎన్నికైతే విద్యుత్ బిల్లులు, విద్యుత్ పంపిణీ సమస్య పరిష్కారానికి తొలి వారంలోనే చర్యలు తీసుకుంటానని లిజ్ ట్రస్ హామీ ఇచ్చారు. ఇందుకోసం క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను పునర్ నిర్మించడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా తాను సిద్ధమేనని లిజ్ ట్రస్ చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం వల్ల బ్రిటన్‌లో ఇంధన ధరలపై ఉన్న సీలింగ్ పరిమితిని 80 శాతం పెంచారు. ఈ నేపథ్యంలో కరెంట్ సమస్యపై దృష్టి పెడతానని లిజ్ ట్రస్ ప్రకటించారు.
సోమవారం సాయంత్రం ఫలితాలు వెలువడిన తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా గెలిచిన వారు లండన్‌లోని క్వీన్ ఎలిజబెత్-2 కాన్ఫరెన్స్ సెంటర్లో ప్రసంగిస్తారు. ఈలోపే తన కేబినెట్ సహచరుల జాబితాను సిద్ధం చేసుకుంటారు. పదవి నుంచి వైదొలగనున్న బోరిస్ జాన్సన్ మంగళవారం తన వీడ్కోలు ప్రసంగం నిర్వహిస్తారు. అంతకుముందే ఆయన స్కాట్లాండ్లోని అబెర్డీన్‌షైర్‌కు వెళ్లి లాంఛనంగా తన రాజీనామాను రాణికి సమర్పిస్తారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన వారు వేరుగా స్కాట్లాండ్ వెళతారు. అక్కడ కన్జర్వేటివ్ పార్టీ నేతను రాణి లాంఛనంగా ప్రధానిగా నియమిస్తారు. యూకే చరిత్రలో తొలిసారి ఇంగ్లండ్ వెలుపల.. ప్రధానమంత్రి నియామకం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం కొత్త బ్రిటిష్ ప్రధాని లండన్‌లోని తన అధికారిక నివాసంలో తొలిసారి ప్రసంగిస్తారు. బుధవారం మధ్యాహ్నం కొత్త ప్రధాని.. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిపక్ష నేత నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటారు.
ఇవీ చదవండి: 'భారత్ పెద్ద దేశం.. రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు'
లండన్‌లో అదృశ్యమైన కారు పాక్‌లో ప్రత్యక్షం.. ఎలా గుర్తించారంటే?