ఆస్ట్రేలియాలో రెండు హెలికాప్టర్లు ఢీకొని బీచ్‌లో పడ్డాయి. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బీచ్‌లో సేదతీరుతున్న వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని అత్యవసర సేవలు అందించారు.
క్వీన్స్లాండ్ రాష్ట్రం గోల్డ్ కోస్ట్‌లోని బీచ్ వద్ద ఉన్న 'సీ వరల్డ్' థీమ్ పార్క్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. మరో హెలికాప్టర్ టేకాఫ్‌కు యత్నించింది. ఈ క్రమంలోనే రెండు హెలికాప్టర్లు ఢీకొట్టాయి. అనంతరం ఓ హెలికాప్టర్ సురక్షితంగా సముద్రతీరంలోని ఇసుకపై ల్యాండ్ అయింది. కానీ మరో హెలికాప్టర్ మాత్రం తీవ్రంగా ధ్వంసమైంది. దాని విడిభాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతులు సహా, తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు ప్రయాణికులు క్రాష్ అయిన హెలికాప్టర్లో ఉన్నారు.
'ధ్వంసమైన హెలికాప్టర్లో ఉన్న వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అందించి.. క్షతగాత్రులను ఆకాశమార్గంలో ఆస్పత్రికి తరలించారు' అని పోలీసులు తెలిపారు. రెండో హెలికాప్టర్ విండ్ షీల్డ్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు.. ఆస్ట్రేలియా ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో వెల్లడించింది.