రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు చేసిన అరాచకాలు జ్ఞాపకాలు ఇంకా ఐరోపాను వెంటాడుతున్నాయి. తాజాగా ఉత్తర పోలాండ్‌లోని సోల్డౌ ప్రాంతంలో గతంలో నాజీలు నిర్వహించిన ఓ కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌లో దాదాపు 8,000 మంది చితా భస్మాన్ని, అస్థికలను గుర్తించారు. వీరందరి శరీరాలను ఒక గోతిలోవేసి ఎవరూ గుర్తుపట్టకుండా దహనం చేసినట్లు పోలాండ్‌కు చెందిన నేషనల్ రిమంబరెన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన టోమోజ్ జంకోవిస్క్ తెలిపారు. సోల్డౌ ప్రాంతంలో యూదులను, పోలీష్ ఉన్నత వర్గాల్లోని వ్యతిరేకులను నాజీలు హత్య చేశారు. 1939లో ఇక్కడ కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌ను నిర్మించారు. దీనిని ప్రత్యర్థి వర్గాల నిర్బంధానికి, నిర్మూలనకు వాడుకొన్నారు. ఇక్కడ కనీసం 30 వేల మందిని నాజీలు హత్య చేసి ఉంటారని పరిశోధకులు అనుమానిస్తున్నారు.
ఇక్కడ పరిశోధకులు వందల కొద్దీ దుస్తులను, ఇతర వస్తువులను కనుగొన్నారు. వీటిల్లో ఖరీదైనవి ఏవీ లేవు. దీనిని బట్టి మృతుల శరీరంపై విలువైన వస్తువులను కూడా నాజీలు దోచుకొన్నట్లు నిర్ధారణకొచ్చారు. సోల్డౌ ప్రాంతంలో పరిశోధకులు రెండు భారీ గోతులను కనుగొన్నారు. దాదాపు 17.5 టన్నుల చితాభస్మం,అస్థికలను గుర్తించారు. ఒక్కో వ్యక్తి అవశేషాలు కనీసం 2 కిలోల బరువు ఉంటాయని పేర్కొన్నారు. పోలాండ్‌లో జర్మనీ నాజీలు చేసిన అరాచకాలు, ఆర్థిక నష్టాలను ప్రస్తుత విలువకు తగినట్లు లెక్కగడుతున్నామని ప్రభుత్వం పేర్కొంది. నాజీలకు సంబంధించిన అరచకాలకు పరిహారం చెల్లింపు వ్యహారం 1950లోనే ముగిసింది. దీంతో జర్మనీ నుంచి పోలిష్ ప్రజలకు ఎటువంటి పరిహారం లభించలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 60 లక్షల మంది పోలీష్ ప్రజలు మరణించి ఉంటారని అంచనా. వీరిలో 30 లక్షల మంది యూదులే. ఇక మొత్తం 850 బిలియన్ డాలర్ల వరకు ఆస్తినష్టం ఉంటుందని పలు అంచనాలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చూడండి : బ్రిటన్ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తా.. వాటినే నమ్ముతాను: రిషి సునాక్