డ్రైవర్ నిద్రమత్తు కారణంగా 14 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 19 మందికి గాయాలయ్యాయి. ఇండోనేసియా సురబాయలోని మోజోకెర్తోలో సోమవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది.
బస్సులోని ప్రయాణికులంతా పర్యటకులు. సురబాయకు చెందిన వారంతా మధ్య జావాలోని ప్రముఖ పర్వత ప్రాంతమైన డీంగ్ పీఠభూమికి విహార యాత్రకు వెళ్లి తిరిగొస్తున్నారు. సోమవారం ఉదయం మోజోకెర్తో వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఓ హోర్డింగ్‌ను ఢీకొట్టింది. అనేక మంది అక్కడికక్కడే మరణించారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాత్రుల్ని నాలుగు ఆస్పత్రులకు తరలించారు. వారిలో అనేక మందికి ఎముకలు విరిగాయని, చికిత్స కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రాథమికంగా భావిస్తున్నా.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను.. కోలుకున్నాక ప్రశ్నిస్తామని చెప్పారు.