ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 14-20 మధ్య వారం వ్యవధిలోనే 20 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఇప్పటివరకు వారంలో ఇవే అత్యధిక కేసులని తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 6 శాతం అధికం. మరణాలు మాత్రం 10 శాతం పెరిగాయని స్పష్టం చేసింది.
రష్యాలో రోజూ 6 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 6,215 మందికి వైరస్ సోకింది. మరో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 11 లక్షల 15 వేలు దాటాయి. మరణాలు 20 వేలకు చేరువయ్యాయి.
అక్కడ ఆంక్షలు..
బ్రిటన్‌లో కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య కొద్ది రోజులుగా రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇంగ్లాండ్‌లో ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని బోరిస్ జాన్సన్. విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. విద్యాసంస్థలు తెరుచుకొనే ఉంటాయని స్పష్టం చేశారు.
- మెక్సికోలో కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ మరో 2,917 కేసులు.. 204 మరణాలు నమోదయ్యాయి.
- ఇరాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేసియాల్లో కేసులు వైరస్ తీవ్రత పెరిగిపోతోంది. ఇండోనేసియాలో ఒక్కరోజే 4 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. మరో 160 మంది కొవిడ్‌కు బలయ్యారు.
- నేపాల్‌లో మొత్తం కేసులు 66 వేల 632కు చేరాయి. మంగళవారం 1356 కొత్త కేసులు వెలుగు చూశాయి. కాఠ్మాండూ లోయ.. కరోనా హాట్‌స్పాట్‌గా మారినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 429 మంది వైరస్ సోకింది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్‌లో కొద్దిరోజులుగా కేసులు తక్కువగా బయటపడుతున్నాయి. మరో 582 మంది వైరస్ బారినపడగా.. మొత్తం కేసులు 3 లక్షల 6 వేల 886కు చేరాయి. దేశంలో ఇప్పటివరకు 6,424 మందిని బలితీసుకుంది కొవిడ్.