కొవిడ్-19 మూలాలపై పరిశోధన చేసేందుకు చైనాలో పర్యటిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం. ఇప్పటికే వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్, సీఫుడ్ మార్కెట్ వంటి ప్రదేశాలను సందర్శించింది. దీనిపై ప్రాథమిక నివేదికను వచ్చే వారం ప్రకటించనున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. వుహాన్‌లో నిపుణుల బృందం పర్యటన.. శాస్త్రీయ ప్రక్రియలో కీలకమైనదిగా పేర్కొన్నారు. కరోనా మూలాలపై వచ్చిన అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకుంటామని, అయితే.. అందుకు మరింత విశ్లేషణ, పరిశోధనలు అవరమన్నారు.
"శాస్త్రవేత్తలు లేవనెత్తిన పలు వాదనలను విస్మరించారన్న ప్రశ్నలు తలెత్తాయి. నిపుణుల బృందంలోని కొంత మంది సభ్యులతో మాట్లాడిన తర్వాత.. అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకున్నట్లు ధ్రువీకరిస్తున్నా. అయితే.. మరింత విశ్లేషణ, అధ్యయనాలు అవసరం. ఈ అధ్యయనంపై తుది నివేదికను కొద్ది వారాల్లోనే వెల్లడిస్తాం. నిపుణుల బృందం అన్నింటికి సమాధానాలు కనుగొనలేకపోవచ్చు. అయితే.. కరోనా మహమ్మారి తొలినాళ్లలోని పరిస్థితులు, ఇతర అంశాలపై తమ మిషన్ బాగా అర్థం చేసుకుంది. తదుపరి పరిశోధనల కోసం పలు ప్రాంతాలనూ గుర్తించింది."
- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్
వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదని, దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ బృందం ఇటీవలే ప్రకటించింది. అయితే.. ఆ సమాచారాన్ని తనిఖీ చేయాలనుకుంటున్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
ప్రపంచ దేశాలకు హెచ్చరిక..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గటం మంచి పరిణామమని, కానీ, వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన ఆంక్షలు సడలించటం సరికాదని హెచ్చరించారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్. కొత్త కేసుల సంఖ్యలో వరుసగా నాలుగో వారం క్షీణత కనిపించిందని, మరణాలు కూడా రెండో వారం తగ్గాయన్నారు. అది ఆయా దేశాలు చేపడుతున్న చర్యలతోనే సాధ్యమైందన్నారు. కానీ అలసత్వం వహించటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రస్తుత సమయంలో ఆంక్షలు సడలించటం ఏ ఒక్కరికి అంత మంచిది కాదని సూచించారు.
ఇదీ చూడండి: 'వ్యాక్సిన్ తీసుకున్నా.. మాస్కు తప్పనిసరి'