ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మృతుల సంఖ్య ఆరు వారాల తర్వాత మళ్లీ పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. భారీ స్థాయిలో మరణాలు నమోదవడంపై కొవిడ్-19 ప్రత్యేక నిపుణురాలు మరియా వాన్ కెర్ఖోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన ఆరు వైరస్ వ్యాప్తి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ.. నాలుగు చోట్ల పెద్దఎత్తున కరోనా కేసులు బయటపడ్డాయని చెప్పారు.
"ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 8 శాతం కేసులు పెరిగాయి. ఐరోపాలో సుమారు 12శాతానికిపైగా బాధితులు పెరిగారు. బ్రిటన్లో వెలుగుచూసిన వైరస్ కారణంగానే ఐరోపాలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది."
-మరియా వాన్ కెర్ఖోవ్, డబ్ల్యూహెచ్ఓ నిపుణురాలు
ఆగ్నేయాసియా ప్రాంతంలో వారం వ్యవధిలోనే.. 49శాతం కేసులు పెరిగాయని కెర్ఖోవ్ వెల్లడించారు. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 29శాతం పెరగ్గా.. ఫిలిప్పీన్స్లో వ్యాప్తి అధికంగా ఉందని చెప్పారు. తూర్పు మధ్యదరా ప్రాంతంలో కేసులు 8 శాతం మేర పెరిగాయన్నారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్ మాత్రమే సరిపోదన్న కెర్ఖోవ్.. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం కీలకమని స్పష్టం చేశారు.