చైనా ఒత్తిడి మేరకు కరోనా వైరస్ వ్యాప్తి సమాచారాన్ని తాము తొక్కిపెట్టినట్టు వస్తున్న ఆరోపణల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ జర్మనీ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనం నిరాధారం, అవాస్తవం అని తెలిపింది. కథనంలో పేర్కొన్నట్లుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ మధ్య జనవరి 21న ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని వివరించింది.
"ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందని జనవరి 20న చైనా సమాచారం అందించింది. దీన్ని నిర్ధరించుకొని రెండు రోజుల్లో యావత్తు ప్రపంచానికి డబ్ల్యూహెచ్‌ఓ తెలియజేసింది. అనంతరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రతను కచ్చితంగా అంచనా వేసి ఫిబ్రవరి 11న మహమ్మారిగా ప్రకటించాం." - ప్రపంచ ఆరోగ్య సంస్థ
జర్మనీ వారపత్రిక కథనంతో..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒత్తిడి వల్లే డబ్ల్యూహెచ్‌ఓ వైరస్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో జాప్యం చేసిందంటూ జర్మనీకి చెందిన ఓ ప్రముఖ వారపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు అధనోమ్‌తో జిన్‌పింగ్ జరిపిన ఫోన్ సంభాషణ ఆధారాలు జర్మనీ విదేశీ నిఘా సంస్థల వద్ద ఉన్నట్లు పేర్కొంది.
ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందన్న విషయంతో పాటు విశ్వవ్యాప్త సాంక్రమిక వ్యాధి(మహమ్మారి)గా దీన్ని ప్రకటించడానికి ఇంకొన్ని రోజులు వేచిచూడాలని జిన్‌పింగ్ కోరినట్లు కథనంలో పేర్కొన్నారు. చైనా విధానాల వల్ల అప్పటికే ఆరు వారాల కీలక సమయం గడిచిపోయిందని ఆరోపించింది
తాజాగా దీన్ని ఖండించిన డబ్ల్యూహెచ్‌ఓ.. జిన్‌పింగ్‌తో అధనోమ్ ఫోన్ ద్వారా ఎప్పుడూ మాట్లాడిన సందర్భాలు లేవని తెలిపింది. ఇలాంటి నిరాధార ఆరోపణల వల్ల.. మహమ్మారిపై ప్రపంచ దేశాలతో కలిసి సంస్థ చేస్తున్న పోరాటానికి ఆటంకం కలుగుతుందని వివరించింది.
వైరస్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో చైనా సహా డబ్ల్యూహెచ్‌ఓ ఘోరంగా విఫలమైందని అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ముందు వరుసలో ఉంది. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకు సహాయ నిధులను నిలిపివేసింది. చైనాలోని వుహాన్ నగరంలోని వైరాలజీ ల్యాబ్ నుంచే వైరస్ వచ్చిందని ట్రంప్ సహా ఆయన పాలకవర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది.
ఇదీ చూడండి: 'కరోనా వచ్చినా వుహాన్ మార్కెట్‌ను మూసేయలేం'