అక్టోబర్‌లో ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే ఆ సంస్థ గ్రేలిస్టులో (FATF Grey List Countries 2021) పాక్ కొనసాగుతుండగా.. కొత్తగా టర్కీని కూడా దానిలో చేర్చింది. దీంతో టర్కీ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయే పరిస్థితి నెలకొంది. అసలు ఈ ఆర్థిక చర్యల కార్యదళం అంటే ఏమిటీ..? దీని ప్రభావం పాక్, టర్కీలపై ఏ రకంగా పడుతుందంటే..
అసలు ఎఫ్‌ఏటీఎఫ్ అంటే ఏమిటీ..?
అక్రమ మార్గాల్లో ప్రవహించే నగదు చీకటి కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి ఊతం ఇస్తాయి. చాలా వెనుకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చేవిధంగా ఉంటాయి. ఇటువంటి పనులను నిరోధించడానికి ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం కాదు. పారిస్ కేంద్రంగా జీ-7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీనిని ప్రారంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు (FATF Grey List Countries 2021) వెళ్లకుండా కొన్ని నిబంధనలను ఇవి ప్రవేశపెట్టాయి. జీ7 దేశాలు సంపన్నమైనవి కావడం వల్ల ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయడం ఎఫ్‌ఏటీఎఫ్ విధి.
2006లో భారత్ ప్రవేశం..
2006లో భారత్‌కు ఎఫ్‌ఏటీఎఫ్ అబ్జర్వర్ హోదా ఇచ్చింది. ఆ తర్వాత దీనిలో పూర్తి సభ్యత్వం (FATF India Member) కోసం కృషి చేసింది. ఫలితంగా 2010 జూన్ 25 తేదీన 34వ సభ్య దేశంగా చేరింది. ప్రస్తుతం 39 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిల్లో ఐరోపా సమాఖ్య, జీసీసీ కూడా సభ్యులే.
9/11 దాడుల తర్వాత మరింత కఠినంగా..
అమెరికాలో జంట భవనాలపై ఉగ్రదాడుల తర్వాత ఎఫ్‌ఏటీఎఫ్ మరిన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ సంఘం 2001 అక్టోబర్‌లో వాషింగ్టన్ డీసీలో భేటీ అయింది. ఉగ్రవాద నిరోధాన్ని లక్ష్యంగా మార్చుకొంది. మరోపక్క అదే సమయంలో ఐరాస భద్రతా మండలిలో యూఎన్‌ఎస్‌సీ 1373 తీర్మానాన్ని ఆమోదించారు. దీనిని 1999లో అల్‌ఖైదా ఉగ్రవాదులపై చేసిన 1267 తీర్మానానికి జోడించారు. ఆ తర్వాత నుంచి అల్‌ఖైదా, తాలిబన్లతో సంబంధాలున్న డజన్ల కొద్దీ సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ఉగ్రనిధులకు అడ్డుకట్టే ఎఫ్‌ఏటీఎఫ్‌కు ప్రధాన విధిగా మారింది. 2018 నుంచి ఎఫ్‌ఏటీఎఫ్ గ్రేలిస్టులో పాకిస్థాన్ ఉంది. అయినా ఆ దేశం తీరులో ఏమాత్రం మార్పు రాలేదు.
ఫ్రాన్స్‌పై పాక్‌కు అనుమానం..
ఎఫ్‌ఏటీఎఫ్ అక్టోబర్ సమావేశంలో కూడా పాక్‌కు గ్రే లిస్టు నుంచి మోక్షం లభించకపోవడంపై ఇమ్రాన్ ఖాన్ సర్కారు తీవ్ర అసహనంతో ఉంది. పాకిస్థాన్‌లో జరుగుతున్న ఫ్రాన్స్ వ్యతిరేక నిరసనలు ఈ రకంగా ప్రతికూల ప్రభావం చూపాయని భావిస్తోంది. ఫ్రాన్స్ చొరవతోనే గ్రేలిస్టులో ఉండిపోయినట్లు అనుమానిస్తోంది. దీనికి తోడు ఇన్నాళ్లూ పాక్‌కు అండగా నిలిచిన టర్కీని కూడా ఈ జాబితాలో చేర్చడం మరో ఎదురుదెబ్బ. దీంతో పాక్‌కు బ్లాక్‌లిస్టులోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఆదివారం ఎఫ్‌ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్కస్ ప్లయర్ స్పందించారు. ఎఫ్‌ఏటీఎఫ్ నిర్ణయాలు సమష్టిగా ఉంటాయని తెలిపారు. సంస్థలోని 39 సభ్యదేశాల నిర్ణయాల ఆధారంగా ఇది ఉంటుందని పేర్కొన్నారు.
గ్రేలిస్ట్ ప్రభావం ఇదీ..
ఎఫ్‌ఏటీఎఫ్ అనుమానాస్పద దేశాల జాబితా (గ్రే లిస్టు)లో ఉండటం ఇస్లామాబాద్‌కు కొత్తేమీ కాదు. 2008లో, 2012-15 మధ్యకాలంలోనూ పాక్ ఆ జాబితాలో ఉంది. ఆయా సందర్భాల్లో ఆర్థికంగా కుదేలైపోయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 2018లో మరోమారు ఈ జాబితాలో చేరడంతో ఏడాదిలో దాదాపు వెయ్యి కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లిందని 2019లో ఆ దేశ విదేశాంగశాఖ మంత్రిగా ఉన్న షా మహమ్మద్ ఖురేషీ వెల్లడించారు. నిషేధిత జాబితా (బ్లాక్ లిస్ట్)లో ప్రవేశిస్తే పాకిస్థాన్‌కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) సంస్థ నుంచి వచ్చే రుణాలూ కష్టతరం కానున్నాయి.
పాక్‌కు తోడుగా టర్కీ..
మొత్తం 8 కారణాలను చెప్పి టర్కీని కూడా (FATF Grey List Countries 2021) ఎఫ్‌ఏటీఎఫ్ గ్రేలిస్టులో చేర్చింది. మనీ లాండరింగ్‌పై నిరోధక చర్యల్లో లోపాలు, ఐరాస ఆంక్షల అమలుకు సహకరించకపోవడం, ప్రభుత్వేతర సంస్థల ద్వారా ఉగ్ర వాదానికి నిధుల మళ్లింపు వంటి తీవ్ర ఆరోపణలు దీనిలో ఉన్నాయి. టర్కీకి నయా అటమాన్ సామ్రాజ్య కళను తెచ్చేందుకు అధ్యక్షుడు ఎర్డగాన్ చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆధిపత్యం కోసం టర్కీ పలు దేశాలతో తగాదాలు పెట్టుకొంది. ఇస్లాం ప్రపంచంలోని యుఏఈ-సౌదీ జోడీని సవాలు చేసేందుకు యత్నించింది. నాటోలో సభ్య దేశంమైనా.. పలు అంశాల్లో అమెరికాతో కయ్యానికి కాలు దువ్వింది. ఇక రష్యాకు వ్యతిరేకంగా సిరియాలో పనిచేసింది. పొరుగునున్న గ్రీస్ సమీపంలోకి చమురు డ్రిల్లింగ్ నౌకలు పంపి భయపెట్టే యత్నాలు చేసింది.
భారీ మూల్యం చెల్లిస్తూ..
మే నెలలో ఐఎంఎఫ్ పరిశోధన ప్రకారం టర్కీ కనుక ఎఫ్‌ఏటీఎఫ్ గ్రేలిస్టులో చేరితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. హాట్‌మనీగా పిలిచే స్వల్పకాల పెట్టుబడుల్లో 3శాతం తగ్గి, ప్రత్యక్ష పెట్టుబడుల్లో 3శాతం కోల్పోయినా భారీ మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. జీడీపీలో మూడు శాతం అంటే 23 బిలియన్ డాలర్లకు సమానం. టర్కీ 2020 వార్షిక రక్షణ రంగ బడ్జెట్ 17 బిలియన్ డాలర్లకు సమానం. ఆ లెక్కన 23 బిలియన్ డాలర్లంటే టర్కీకి ఎంత పెద్దమొత్తమో అర్థం చేసుకోవచ్చు. 2007లోని విదేశీ పెట్టుబడులు 19 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2020లో టర్కీకి వచ్చినవి 5.7 బిలియన్ డాలర్లు మాత్రమే . అంటే ఇప్పటికే కష్టాల్లో ఉన్న టర్కీకి ఎఫ్‌ఏటీఎఫ్ నిర్ణయం శరాఘాతమే.
ఇదీ చూడండి : 'ఆర్థిక సాయం విస్మరించి ఆ దేశాలపై ఒత్తిడి తగదు'