నగరంలోని ఓ వీధిలో కరోనా వైరస్ కేసులేమీ లేవు. ప్రస్తుతానికి అక్కడంతా సురక్షితంగానే కనిపిస్తున్నా ప్రజలు, అధికారుల్లో మాత్రం ఆందోళనగా ఉంది. ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు చేయకముందే వైరస్ జాడ పసిగట్టగలిగితే? మరిన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అప్రమత్తమై కట్టడికి వ్యూహాలు రచించొచ్చని వారి భావన. అయితే వృథా, మురుగు నీటిని పరీక్షించడం ద్వారా ఇదంతా సాధ్యమే అంటున్నారు నిపుణులు.
ఇటలీలో కొవిడ్-19 తొలి కేసును గుర్తించిన రెండు నెలల ముందే ఆ దేశంలోని రెండు పెద్ద నగరాల్లో వైరస్ జాడ కనిపించినట్టు తెలిసింది. అక్కడి జాతీయ ఆరోగ్య కేంద్రం శాస్త్రవేత్తలు వృథా, మురుగునీటిని పరీక్షించారు. గతేడాది డిసెంబర్‌లో మిలన్, ట్యూరిన్, 2020 జనవరిలో బొలొగ్న నగరాల్లో నీటి నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షించగా డిసెంబర్‌లోనే సార్స్-కొవ్2 జన్యు జాడలు కనిపించాయి. కాగా ఇటలీలోని కొడగ్నొలో మొదటి కేసు ఫిబ్రవరి 21న నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత విపరీతంగా వ్యాపించింది.
వృథా, మురుగు నీటిని పరీక్షించడం ద్వారా ముందుగానే వైరస్ జాడను గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందేందుకు ఉన్న అవకాశాలను సైతం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 2019 అక్టోబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు వీరు నమూనాలు సేకరించారు. రెండు ప్రయోగశాలల్లో వేర్వేరు పద్ధతుల్లో పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 18న సేకరించిన మిలన్, ట్యూరిన్, 2020, జనవరి 29న సేకరించిన బొలొగ్న నీటిలో వైరస్ జన్యు జాడల్ని గుర్తించారు. ఇక 2019, అక్టోబర్, నవంబర్‌లో సేకరించిన అన్ని నమూనాల్లో నెగటివ్ రావడం గమనార్హం.
ఐరోపాలోని ఇతర నగరాల్లోని నీటి నమూనాల్లోనూ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ జాడను గుర్తించారు. బార్సిలోనా (మొదటి కేసుకు 40రోజులు ముందు), బ్రిస్బేన్, పారిస్, ఆమ్‌స్టర్‌డ్యామ్ నమూనాల్లోనూ ఇదే విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమై ప్రతి నెలా అన్ని నగరాల్లో వృథా, మురుగు నీటి నమూనాలు సేకరించాలని నిపుణులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:పోటీల కోసం తాబేలుకు ఉపగ్రహ ట్రాకర్