ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రకృతి సోయగాల నిలయం. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళ్లాలనుకునే పర్యటక ప్రదేశం యూరప్. కానీ, కరోనా ఐరోపా ఆనవాళ్లనే మార్చేసింది. మహమ్మారి పంజాకు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి దేశాలు. ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలండ్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియంతో పాటు బ్రిటన్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కేసులు, మరణాలు.. నిండిపోయిన ఆస్పత్రులు, బాధితుల సామూహిక ఖననాలు, సదుపాయాల కొరత, లాక్డౌన్లు ఇలా అక్కడ పరిస్థితులు పూర్తిగా విషమించాయి.
అంతలోనే మరోసారి..
నాలుగు నెలల విధ్వంసం తర్వాత పరిస్థితులు మెల్లిమెల్లిగా చక్కబడ్డాయని భావించారు యూరప్ ప్రజలు. కరోనా పూర్తిగా అంతం కాకపోయినా.. కేసుల సంఖ్య తగ్గముఖం పట్టిన తర్వాత యూరప్ మెల్లిగా తెరుచుకుంది. ఇటలీ వస్త్ర దుకాణాలు తెరుచుకున్నాయి. నెదర్లాండ్స్ తులిప్ తోటలు మళ్లీ వికసించాయి. జర్మనీలో కార్ల సంస్థలు ఉత్పత్తి మొదలుపెట్టాయి. స్పెయిన్‌లో సినిమా షూటింగ్‌లు, బ్రిటన్‌లో క్రికెట్, ఫ్రాన్స్‌లో ఫుట్‌బాల్ తిరిగి మొదలయ్యాయి. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని అనుకునేలోపే మళ్లీ విజృంభిస్తోంది మహమ్మారి. మరోసారి లాక్‌డౌన్ పరిస్థితులు తీసుకొచ్చింది. భారీగా కేసులు నమోదవుతున్నాయి.
ఐరోపా వ్యాప్తంగా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముప్పు అధికంగా ఉండే వర్గాల్లో వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంది. యూరప్ మరోసారి కరోనాకు వ్యాప్తికి కేంద్రంగా మారే అవకాశాలున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అప్రమత్తమైన ప్రభుత్వాలు ఆంక్షలతో ముందుకొస్తున్నాయి.
యూరప్‌లో పరిస్థితులు ఇలా..
- చెక్ రిపబ్లిక్లో పాఠశాలలు మూసివేసి ఆ భవనాలను ఆస్పత్రులుగా మార్పు
- పోలండ్‌లో పాఠశాలలు, వ్యాయామశాలల మూసివేత. రెస్టారెంట్లపై ఆంక్షలు
- ఫ్రాన్స్‌లో ప్యారిస్ సహా ఇతర ప్రధాన నగరాల్లో రాత్రి 9గంటల తర్వాత కర్ఫ్యూ
- బ్రిటన్‌లో పబ్‌లు, బార్ల మూసివేత. లండన్ సహా ఇతర నగరాల్లో వివిధ ఆంక్షలు
ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనాపై పోరులో ఇదొక కీలక మలుపుగా అభివర్ణిస్తున్నారు పాలకులు.
ఇది తక్కువ అంచనా వేయడానికి అవకాశంలేని తీవ్రమైన పరిస్థితి. యూరోపియన్ స్థాయిలో వైరస్‌తో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.
-రాబెర్టో స్పెరాంజా, ఇటలీ ఆరోగ్య మంత్రి
అదుపుపై దృష్టి
అధికారులు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే పరిస్థితులు లేవు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమైన వేళ.. వైరస్ కట్టడికి అవసరమైన ఆంక్షలపైనే దృష్టి సారించారు.
ఫ్రాన్స్
కర్ఫ్యూ కోసం ఫ్రాన్స్ 12,000మంది పోలీసులను రంగంలోకి దించింది. ప్యారిస్‌తో సహా మరో 8మెట్రో పాలిటన్ నగరాల్లో నెలరోజుల పాటు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి.
ఇటలీ
మరోవైపు మొదట్లో వైరస్ కారణంగా కకావికలమైంది ఇటలీ. ఆసియా వెలుపల సామాజిక వ్యాప్తి మొట్టమొదట వెలుగుచూసింది ఇక్కడే. కరోనా సృష్టించిన పెను విధ్వంసం నుంచి బయటపడి.. పరిస్థితులు చక్కబడ్డాయని అనుకున్నారు. కోలుకుని జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. అంతలోనే మరోసారి పెరుగుతున్న కేసులు ఇటలీని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. వారం వ్యవధిలోనే భారీగా కేసుల పెరుగుదల కనిపించింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది.
మరో 15 రోజుల్లో పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిద్దాం. కానీ, వైరస్ వ్యాప్తిని అదుపు చేయలేని పరిస్థితులు తలెత్తితే.. మరోసారి కఠిన ఆంక్షలు విధించక తప్పని పరిస్థితులు వస్తాయి.
-మస్సిమో గళ్లీ, మిలాన్ వైద్య నిపుణులు
వృద్ధులకు, ఇతర జబ్బులు ఉన్నవారు వైరస్‌బారిన పడుతుండటం, లక్షణాలు లేని కేసులు వస్తుండటం.. వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం ఒక్కరోజే అక్కడ 8,804కేసులు.. 83-కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. 40 రోజుల్లో ఇదే అత్యధికం.
చెక్ రిపబ్లిక్
ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్లలో రెండువారాలుగా.. ప్రతి లక్షమందిలో దాదాపు 300మంది పాజిటివ్‌గా తేలుతున్నారు. ఇక చెక్ రిపబ్లిక్లో ఈ సంఖ్య 700గా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది అక్కడి ప్రభుత్వం. స్థానిక పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. జర్మనీ సాయం కోసం అర్థిస్తోంది చెక్.
స్విట్జర్లాండ్
ఇక స్విట్జర్లాండ్‌లోనూ పరిస్థితులు ఇలాగే కనిపిస్తున్నాయి. స్విస్ ఆస్పత్రులు పెరుగుతోన్న కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేసుల నమోదులో రోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఐరోపాలో వైరస్ సెకండ్ వేవ్ వచ్చిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు ఆంక్షల మంత్రం జపిస్తున్నారు. దాదాపు 85లక్షల మంది జనాభా ఉండే ఈ చిన్న దేశంలో.. కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. జెనీవా సహా ఇతర ప్రాంతాల్లో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అధునాతన వైద్య వ్యవస్థ ఉన్న ఈ దేశంలో.. ఇప్పటికే దాదాపు 72వేల మంది వైరస్ బారిన పడ్డారు. 1,800 మంది అసువులు బాసారు. తాజాగా బుధవారం ఒక్కరోజే 2,800 కేసులు రావటం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.
బ్రిటన్
మార్చినెలలో కరోనా వైరస్ మహమ్మారి దాటికి యూకే వణికిపోయింది. అనంతరం వైరస్ వ్యాప్తి కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఈ సమయంలో యూకేలో మార్చి నెలలో లాక్‌డౌన్ విధించినప్పటి పరిస్థితులే మరోసారి పునరావృతం అవుతాయని అక్కడి ప్రభుత్వ ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితుల వల్ల ఈ వైరస్ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంటున్నారు.
అక్కడ కరోనా సెకండ్ వేవ్ భయాందోళనలను కలిగిస్తోంది. బ్రిటన్ రాజధాని లండన్‌లో మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అక్టోబర్ 16 అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు అమలు అవుతున్నాయి.
ఇలా ఐరోపా వ్యాప్తంగా వైరస్ మరోసారి విజృంభిస్తుండటం అందరిలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. వ్యాక్సిన్ రావటానికి ఇంకా సమయం పట్టే అవకాశాలున్నందున.. మరోసారి ఆంక్షలే అస్త్రంగా చేసుకోవాలని దేశాలు భావిస్తున్నాయి. వైరస్‌ను గుర్తించి 10నెలలు అయినా... ఇప్పటికీ విరుగుడు లేకపోటం. మరోవైపు సెంకండ్ వేవ్‌తో మహమ్మారి బెంబేలిత్తిస్తుండటం వల్ల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లకు చేరువలో కరోనా కేసులు
ఇదీ చూడండి: దేశంలో మరోసారి 8లక్షల దిగువకు యాక్టివ్ కేసులు