ఇంటి లోపల ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండేందుకు వెంటిలేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. అయితే.. సరైన వెంటిలేషన్ లేకుంటే కరోనా మహమ్మారి బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా చలికాలంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్న సమయంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది.
బ్రిటన్కు చెందిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. ఈ అధ్యయనం జర్నల్స్ ఆఫ్ ప్లూయిడ్ మెకానిక్స్లో ప్రచురితమైంది.
ఎక్కువగా వినియోగించే మిక్సింగ్ వెంటిలేషన్ ద్వారా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని గుర్తించారు. ఈ వెంటిలేషన్ వ్యవస్థ గాలిని గదుల్లో సమానంగా విస్తరించేలా చేస్తుందని.. అందులో ధూళి కణాలు, రేణువులు, ఏరోసోల్స్, ముఖ్యంగా కరోనా మహమ్మారిని కలిగించే సార్స్ కోవ్-2 వంటి వైరస్లు ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది నివేదిక. ప్రజలు దగ్గటం, తుమ్మడం, మాట్లాడటం, ఊపిరి తీసుకోవటం చేసిన క్రమంలో కరోనా వైరస్ ప్రాథమికంగా గాలి ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, వైరస్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు సరైన వెంటిలేషన్ వ్యవస్థ, మాస్క్ ధరించడం అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఇప్పటివరకు చేపట్టిన పరిశోధనల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లోని వైరస్ వ్యాప్తి కంటే ఇంటి లోపలే వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తేలింది.
"ఉత్తర అర్ధగోళంలో శీతకాలం సమీపిస్తున్నప్పుడు ప్రజలు ఇంటిలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. వైరస్ సంక్రమించే ప్రమాదాన్ని అంచనా వేయటం, వ్యాప్తిని కట్టడి చేయటంలో వెంటిలేషన్ పాత్ర కీలకం. శ్వాస వదిలినప్పుడు కార్బన్ డయాక్సైడ్తో పాటు వైరస్ కలిగిన ఏరోసోల్స్.. వెంటిలేషన్ ద్వారా వచ్చే గాలితో గది మొత్తం వ్యాప్తిస్తాయి. సరైన వెంటిలేషన్ లేకపోవటం వల్ల గదిలో కార్బన్డయాక్సైడ్ పెరిగిపోతుంది. అది వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది."
- పాల్ లిండెన్, సహరచయిత, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం.
భవనాల్లో గాలి వ్యాప్తి ప్రధానంగా మిక్సింగ్ వెంటిలేషన్ లేదా స్థానభ్రంశ వెంటిలేషన్ ద్వారా సరైన రీతిలో ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రెండో వెంటిలేషన్ అంశంలో వెంటిలేటర్లను గది కింది, పై భాగంలో బిగిస్తారు. దీని ద్వారా చల్లగాలి కింద నుంచి రాగా.. వేడిగాలి పైనుంచి వెళ్లిపోతుంది. శ్వాస వదిలినప్పుడు గాలి వేడిగా ఉంటుంది. అందులో చాలా వరకు గది పైభాగంలోకి చేరుతుంది. ఈ క్రమంలో సరైన రీతిలో వెంటిలేషన్ ఉంటే ఇతరులు వదిలిన వేడి గాలి బయటకి వెళ్లిపోయి.. వైరస్ ముప్పును తగ్గిస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు.
ఇదీ చూడండి: 'ఎలా ఉన్నావ్?' నుంచి 'నోరు మూస్తావా' వరకు...