Ukraine Cyber Army: తమపై భీకర దాడులకు దిగుతున్న రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ అన్ని మార్గాలను వాడుకుంటోంది. విద్యార్థులు, న్యాయవాదులు, నటులు సైతం ఆయుధాలను చేతబట్టి సైనికులకు సహకరిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకువస్తున్న ఐటీ నిపుణులు సైతం ‘డిజిటల్ ఆర్మీ’గా ఏర్పడి తమ వంతు కృషి చేస్తున్నారు.
ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్ స్వచ్ఛంద సైబర్ ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ రంగంలో అనేక మంది ఉక్రెనియన్లు ఉన్నారని.. వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైబర్ వేదికపై దేశం తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. దీంతో లక్షలాది మంది ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు.
స్వీయ నియంత్రణలో ఉన్న ఓ దండు..
‘తామంతా స్వీయ నియంత్రణలో పనిచేస్తున్న ఓ దండు’లా ముందుకు సాగుతున్నామని డిజిటల్ ఆర్మీలో కీలకంగా వ్యవహరిస్తున్న 37ఏళ్ల ఐటీ ఎగ్జిక్యూటివ్ రోమన్ జఖరోవ్ తెలిపారు. రష్యన్ వెబ్‌సైట్ల సేవల్ని అడ్డుకోవడంతో పాటు టెలిగ్రాం ఛానళ్లలో ప్రత్యేక బోట్లను నిర్వహించడం వరకూ అనేక కార్యక్రమాలను ‘స్టాండ్ ఫర్ ఉక్రెయిన్’ పేరిట ఏర్పడ్డ జఖరోవ్ బృందం నిర్వహిస్తోంది. తప్పుడు వార్తలను అడ్డుకోవడం, రష్యన్ సేనలు ఏయే ప్రాంతాలకు చేరుకున్నారు వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. దీని కోసం స్థానికంగా ఉన్న అనేక మందిని ప్రత్యేక ఛానళ్లలో చేర్చుతున్నారు. వారి ద్వారా సమాచారాన్ని రాబట్టి దాన్ని విశ్లేషించి.. ఎప్పటికప్పుడు ఇతరులకు పంచుతున్నారు. తమదైన వ్యూహాలు, విశ్లేషణల ద్వారా రష్యన్ సేనల్ని ఎలా అడ్డుకోవాలో సూచనలు చేస్తున్నారు.
నేరుగా రష్యన్లకే ఫోన్లు..
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉక్రెనియన్లు సైతం ఈ డిజిటల్ ఆర్మీలో పనిచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఆన్‌లైన్ యాడ్ బయ్యర్లు చురుగ్గా తమ సహకారాన్ని అందిస్తున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. యుద్ధం వల్ల సంభవిస్తున్న దారుణాల్ని సందేశాల రూపంలో చేరవేస్తున్నారు. చివరకు రష్యన్లకు స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. మెయిళ్లు, టెక్ట్స్ మెసేజ్‌లు పంపుతున్నారు. ఉక్రెయిన్ వీధుల్లో తిరుగుతున్న రష్యన్ సైనికుల ఫొటోలు, వీడియోలు తీసి వారి స్వదేశానికి పంపుతున్నారు. ఈ చిత్రాలను వారి తల్లిదండ్రులు చూసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ డిజిటల్ ఆర్మీ చేస్తున్న పోరాట ఫలితాల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడం కష్టమే. అయితే, ఇప్పటికే అనేకసార్లు రష్యన్ వెబ్‌సైట్లను ఆఫ్‌లైన్‌లోని తీసుకెళ్లగలగడం గమనార్హం.
ఎంత పటిష్ఠమైనా రష్యాకు పాట్లు తప్పలేదు..
రష్యన్ ఆర్థిక వ్యవస్థ, క్రెమ్లిన్ నియంత్రణలో ఉన్న మీడియా, రైల్వేలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ ఐటీ ఆర్మీ దాడి చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. రష్యన్ బ్యాంకింగ్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి తప్పించుకునేలా పటిష్ఠంగా రూపొందించినప్పటికీ.. ఉక్రెనియన్ల హ్యాకింగ్ నైపుణ్యాలకు అవి తలొగ్గక తప్పలేదనే చెప్పాలి. ఇప్పటికే అనేకసార్లు రష్యా బ్యాంకింగ్ వ్యవస్థల టెలికమ్యూనికేషన్లలో అంతరాయాన్ని సృష్టించగలిగారు. రైలు టికెట్ల జారీ వ్యవస్థను దెబ్బతీయగలిగారు. టెలిఫోన్ సేవలకు సైతం అంతరాయం కలిగించగలిగారు.
ప్రమాదం కూడా..
ఉక్రెయిన్ ఐటీ ఆర్మీకి టెలిగ్రామ్‌లో 2,90,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, వీరందరి నుంచి రష్యన్ సేనల్ని నిలువరించగలిగే నిఘా సమాచారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని ఓ ఉక్రెనియన్ సైబర్ నిపుణుడు తెలిపారు. ఈ స్థాయిలో ఐటీ వలంటీర్లు పనిచేయడం కూడా అంత శ్రేయస్కరం కాదని ఆయన హెచ్చరించారు. ఓ గుర్తుతెలియని సంస్థ ఇప్పటికే రష్యన్ ఉపగ్రహాన్ని హ్యాక్ చేసినట్లు ప్రకటించిందని తెలిపారు. అందులో వాస్తవం లేనప్పటికీ.. అది చాలా ప్రమాదకరమైన చర్య అని హెచ్చరించారు. అది మరింత భీకర యుద్ధానికి దారితీసినట్లవుతుందన్నారు. అంతరిక్షాన్ని దుర్వినియోగం చేసినట్లవుతుందన్నారు. ఇలా సైబర్‌స్పేస్‌ను అవాంఛనీయ దాడులకు వాడుకోవడాన్ని స్వాగతించలేమన్నారు.
రష్యా కూడా తగ్గట్లేదు..
మరోవైపు రష్యా సైతం రోజురోజుకీ సైబర్ దాడుల డోసుని పెంచుతున్నట్లు సమాచారం. ఉక్రెయిన్ వెబ్‌సైట్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని అక్కడి అధికారులు ఆరోపిస్తున్నారు. ఐరోపాలో శుక్రవారం అనేక ప్రాంతాల్లో అంతర్జాల సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. విద్యుత్తు సరఫరా సైతం దెబ్బతినట్లు ప్రభుత్వాలు ధ్రువీకరించాయి. ఈ-మెయిళ్ల ద్వారా వైరస్‌లను చొప్పించి ఆయా పరికరాలు పనిచేయకుండా చేస్తున్నట్లు సమాచారం ఉంది.
ఇదీ చదవండి: భీకర దాడులకు తాత్కాలిక విరామం.. రష్యా కాల్పుల విరమణ ప్రకటన