Ukraine Russia war: ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సాగిస్తున్న పోరుపైనే ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఆయన ఉక్రెయిన్‌ను కబళిస్తారని అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే పుతిన్ విస్తరణ కాంక్ష కేవలం అక్కడికే పరిమితం కాదని, పశ్చిమాసియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లోనూ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. నియంతలు, తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిన నాయకులతో భద్రతా భాగస్వామ్యాలను ఏర్పర్చుకోవడం ద్వారా దీన్ని సాధించారు. ఓ వైపు సహకారం అందిస్తూ.. బదులుగా నగదు, సహజవనరులు, ఆ దేశ వ్యవహారాల్లో పెత్తనం, అక్కడ యుద్ధవిమానాలను నిలిపి ఉంచడానికి అనుమతులు వంటివి రష్యా పొందుతోంది. నాటో కూటమి తమను చుట్టుముట్టిందన్న భావనలో రష్యా ఉంది. దీనికి విరుగుడుగా తాము ఆ కూటమిని చుట్టుముట్టాల్సిన సమయం ఆసన్నమైందని పుతిన్ భావిస్తున్నారు. ఇది నాటోకు కంటిమీద కునుకులేకుండా చేసే పరిణామమే.
Russia Ukraine news
- 2019లో పుతిన్ నిర్వహించిన రష్యా-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సుకు ఏకంగా 43 మంది నేతలు వచ్చారు. ఈ తరహా సదస్సుల్నే బ్రిటన్, ఫ్రాన్స్‌లు నిర్వహించినప్పుడు ఈ స్థాయిలో నాయకులు హాజరుకాకపోవడం గమనార్హం.
- ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ మార్చి 2న ఐరాస సర్వప్రతినిధి సభలో జరిగిన ఓటింగ్‌కు ఆఫ్రికా ఖండంలోని 17 దేశాలు గైర్హాజరయ్యాయి. 8 దేశాలు తటస్థంగా నిలిచాయి. రష్యాకు ఎరిత్రియా మద్దతు పలికింది. ప్రపంచ యవనికపై ప్రబల శక్తిగా ఎదిగేందుకు గత ఐదారేళ్లలో రష్యా తన సైనిక ప్రాబల్యాన్ని వేగంగా విస్తరించుకోవడం వల్లే ఇది జరిగిందని నిపుణులు చెబుతున్నారు.
ఏ దేశంలో ఎలా?
మాలి: ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న డజనుకుపైగా ఆఫ్రికా దేశాలు వాగ్నెర్ గ్రూప్‌తో భద్రతాపరమైన అవగాహన కుదుర్చుకున్నాయి. మాలిలో తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వం ఈ ముఠా సాయం పొందింది. అక్కడ వాగ్నెర్ సభ్యులు 800 మంది తిష్ఠవేశారు. ఇందుకు మాలి సైనిక ప్రభుత్వం నెలకు కోటి డాలర్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా రాకతో ఫ్రాన్స్ సైన్యం అక్కడి నుంచి వైదొలిగింది.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్: వాగ్నెర్ ముఠాకు చెందిన 2వేల మంది సభ్యులు ‘సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్’లోకి ప్రవేశించి, అక్కడి అధ్యక్షుడు ఫాస్టిన్ ఆర్చేంజ్ టౌవాడెరాను పదవీచ్యుతుడు కాకుండా రక్షించాయి. దీనికి బదులుగా బంగారం, వజ్రాలు పొందినట్లు సమాచారం.
సూడాన్: ఇక్కడ సైనిక తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిన అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్.. రష్యాతో ఆర్థిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. దీంతో ఎర్ర సముద్రంలో నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న పుతిన్ కల నెరవేరడానికి మార్గం సుగమమైందని నిపుణులు భావిస్తున్నారు. మధ్యధరా సముద్రం, సూయజ్ కాలువ, రద్దీ అధికంగా ఉన్న నౌకా మార్గాలపై రష్యా పట్టు బిగించేందుకు ఇది దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు. అంతిమంగా ఇది అరేబియా సముద్రం, హిందూ మహాసాగరంలో తన సైనిక ప్రాబల్యాన్ని చాటడానికి రష్యాకు వీలు కల్పిస్తుంది.
సిరియా: అంతర్యుద్ధంలో ఉన్న సిరియాతో రష్యాకు రక్షణ భాగస్వామ్యం ఉంది. అక్కడి బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా పుతిన్ సేన దాడులు నిర్వహించింది. ఇటీవల సిరియాలో జరిగిన భారీ సైనిక విన్యాసాల పర్యవేక్షణ కోసం రష్యా ఏకంగా తన రక్షణ మంత్రి సెర్గెయ్ షోయిగును పంపింది. అందులో 15 యుద్ధనౌకలు, 30 యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. వాటిలో అణ్వస్త్ర సామర్థ్య బాంబర్ విమానాలు, హైపర్‌సోనిక్ క్షిపణులూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో అమెరికా విమానవాహక నౌకలకు ముప్పు కలిగించే సామర్థ్యం తమకు ఉందని రుజువు చేసుకునేందుకు ఈ విన్యాసాల్లో పుతిన్ సేన ప్రయత్నించింది.
ఉక్రెయిన్‌కు సాయుధ ముఠాలు: సిరియా పాలకులతో తనకున్న మైత్రిని ఉపయోగించుకొని, ఆ దేశంలోని సాయుధ ముఠాలను ఉక్రెయిన్ యుద్ధంలోకి దింపేందుకు రష్యా వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో మాలిని విడిది కేంద్రంగా మలచుకునేందుకు వాగ్నెర్ గ్రూప్ ప్రయత్నిస్తోంది.
ఆఫ్రికా దేశాల మైత్రి ఎందుకు?
రష్యాకు, ఆఫ్రికా దక్షిణ భాగంలోని దేశాలకు మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోని ప్రభావశీల ధనికులు సోవియట్ యూనియన్‌లో చదువుకున్నారు. శ్వేతజాతీయుల పాలన నుంచి తమకు విముక్తి కల్పించడంలో సోవియట్ సాయపడిందని అంగోలా, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలోని అధికశాతం మంది భావిస్తారు. ఆ మేరకు రష్యాను గౌరవిస్తారు.
వాగ్నెర్ గ్రూప్ దన్ను
Wagner Group Russia: ఆఫ్రికా దేశాలతో రష్యా సత్సంబంధాలకు చారిత్రక నేపథ్యం, సిద్ధాంతాలు కొంతమేరే కారణమవుతున్నాయి. ఆయా దేశాల్లోని పాలకుల స్వప్రయోజనాలూ ఇందుకు దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో ‘వాగ్నెర్ గ్రూప్’ అనే సాయుధ ముఠా వారధిగా నిలుస్తోంది. పుతిన్ ఆఫ్రికా, పశ్చిమాసియా వ్యూహంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. తమ దేశాల్లో పట్టు నిలుపుకోవడానికి అక్కడి నేతలు ఈ ముఠాపై ఆధారపడుతున్నారు. పుతిన్‌కు సన్నిహితుడైన యెవెగ్నీ ప్రిగోజిన్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ నడుస్తోంది. ఇది రష్యా సైన్యానికి అనుబంధ సంస్థ అని పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయి. అలాంటి ముఠా ఉనికిలోనే లేదని పుతిన్ ప్రభుత్వం చెబుతోంది. 2015 నుంచి 2021 వరకూ ప్రపంచవ్యాప్తంగా రష్యా ప్రైవేటు సైన్యాల కార్యకలాపాలు ఏడు రెట్లు పెరిగాయి. గత ఏడాది చివరి నాటికి అవి 27 దేశాలకు విస్తరించాయి. ఇందులో వాగ్నెర్ గ్రూప్‌దే ముఖ్య పాత్ర. లిబియా నుంచి మడగాస్కర్ వరకూ అనేక దేశాల్లో ఈ ముఠా భద్రతా కాంట్రాక్టులను దక్కించుకుంది. దీనివల్ల రష్యాకు విలువైన ఖనిజ వనరులపై పట్టు దొరికింది. అక్కడ పశ్చిమ దేశాల ప్రాబల్యానికి క్రమంగా గండిపడుతోంది.
గల్ఫ్, పశ్చిమాసియాలోనూ..
గల్ఫ్ ప్రాంతంలో మొదటి నుంచి అమెరికాకు అనుకూలంగా వ్యవహరించే దేశాల్లోనూ మార్పు కనిపిస్తోంది. రష్యా తీరును ఖండిస్తూ గత నెలలో ఐరాస భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా యూఏఈ.. అమెరికాకు షాక్ ఇచ్చింది. మూడు రోజుల తర్వాత.. ఉక్రెయిన్ యుద్ధంపై అరబ్ లీగ్ జారీ చేసిన ప్రకటనలో రష్యా ప్రస్తావన లేదు. ఈ ప్రభుత్వాలు ఆ తర్వాత సర్వప్రతినిధి సభలో అమెరికాకు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ వాటి తీరు చర్చనీయాంశమైంది.
- ఇందుకు చమురే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చమురు ఉత్పత్తిదారుల కూటమి (ఒపెక్+)ని పరిరక్షించాలని సౌదీ గట్టిగా భావిస్తోంది. ఇందులో రష్యా అతిపెద్ద భాగస్వామి.
- ఇక రెండో కారణం.. ఆయుధాలు. పశ్చిమాసియాలోని అనేక దేశాలు రష్యా అస్త్రాలపై ఆసక్తిగా ఉన్నాయి. అమెరికా నుంచి భారీగా సైనిక సాయాన్ని పొందుతున్నప్పటికీ రష్యా నుంచి యుద్ధవిమానాలు కొనుగోలు చేయాలని ఈజిప్టు భావిస్తోంది.
ఇవీ చూడండి: