Ukraine Russia War: ఉక్రెయిన్‌పై దాడుల్లో భాగంగా రష్యా తన అమ్ములపొదిలోంచి తాజాగా మరో అస్త్రాన్ని బయటకు తీసింది. శుక్రవారం తమ సరికొత్త కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించి.. పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఆయుధ నిల్వల కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. 'హైపర్‌సోనిక్ ఏరోబాలిస్టిక్ క్షిపణులతో కూడిన కింజాల్ ఏవియేషన్ క్షిపణి వ్యవస్థ.. ఇవానో- ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలోని డెలియాటిన్‌లో ఉక్రెయిన్ క్షిపణులు, విమానయాన మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న పెద్ద భూగర్భ గిడ్డంగిని ధ్వంసం చేసింది' అని శనివారం తెలిపింది.
ఉక్రెయిన్‌పై దాడుల్లో కింజాల్ హైపర్‌సోనిక్ ఆయుధాలను ఉపయోగించడం ఇదే మొదటిసారని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. మరోవైపు.. తీరప్రాంత క్షిపణి వ్యవస్థను ఉపయోగించి ఒడెస్సా సమీపంలోని ఉక్రెయిన్ సైనిక రేడియో వ్యవస్థ, నిఘా కేంద్రాలను నాశనం చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
బ్రిటన్ హెచ్చరిక
రష్యా తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకుందని.. దీంతో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని బ్రిటన్ రక్షణశాఖ తన తాజా ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో హెచ్చరించింది. క్రెమ్లిన్ ఇప్పటివరకు తన అసలు లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఫలితంగా రష్యా తన యుద్ధ కార్యాచరణను మార్చుకోవాల్సి వచ్చింది. నిరంతర దాడులతో ప్రత్యర్థిని బలహీనపరిచే అట్రిషన్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీంతో ప్రాణనష్టం భారీగా పెరుగుతుంది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలు నాశనం అవుతాయి. ఈ పరిణామాలు మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తాయి' అని పేర్కొంది. మరోవైపు పుతిన్.. రష్యా మీడియాపై పట్టు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
'నో ఫ్లై జోన్‌కు అమెరికా నో'
రష్యా దాడులతో అల్లాడిపోతోన్న ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగాలంటే తమ గగనతలంపై 'నో ఫ్లై జోన్' విధించాలంటూ ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థిస్తూనే ఉన్నారు. ఇటీవల అమెరికా చట్టసభ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా జెలెన్‌స్కీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఇందుకు అమెరికా విముఖత చూపించింది. ఉక్రెయిన్ గగనతలాన్ని 'నో ఫ్లై జోన్'గా ప్రకటించలేమని పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.
"ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టంగా ఉన్నారు. యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మేం సాయుధ బలగాలను పంపబోం. అలాగే నో ఫ్లై జోన్‌ను కూడా విధించలేం. నో ఫ్లై జోన్‌ను విధించడం అంటే గగనతలంపై నియంత్రణ తీసుకోవడమే. అంటే దానర్థం రష్యా విమానాలను పడగొట్టడమే. అంటే రష్యాతో నేరుగా యుద్ధానికి దిగడమే. అలాంటి పరిణామాలను ఎవరూ చూడాలనుకోవట్లేదు. అది ఆ ప్రాంతానికి, యావత్ ప్రపంచానికి మంచిది కాదు" అని ఆస్టిన్ తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఆ దేశాన్ని అధీనంలోకి తీసుకునేందుకు రష్యా రోజురోజుకీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆసుపత్రులు, భవనాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు జారవిడుస్తోంది. ఓవైపు యుద్ధాన్ని ఆపేందుకు దౌత్యపరమైన చర్చలు జరుగుతుండగానే రష్యా మాత్రం క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఉక్రెయిన్‌లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయులవ్వగా.. 30 లక్షల మందికి పైగా పొరుగు దేశానికి వలసవెళ్లారు.
'చర్చలు జరపాల్సిన సమయం వచ్చింది'
రష్యాతో చర్చలు జరపాల్సిన సమయం వచ్చిందన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. రష్యన్ సేనలు తమ దేశంపై నిర్విరామంగా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో శనివారం ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. "ఉక్రెయిన్‌లో ప్రాదేశిక సమగ్రత, న్యాయాన్ని పునరుద్ధరించాల్సిన సమయం వచ్చింది. కాబట్టీ అందరికీ.. ముఖ్యంగా రష్యాలోని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనం భేటీ అయి చర్చించుకోవాల్సిన సమయం వచ్చింది." అని వీడియోలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి : పశ్చిమ దేశాలు వద్దు .. తూర్పు దేశాలు ముద్దు!