Ukraine Russia conflict: ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకున్న రష్యా.. ఆయా ప్రాంతాలకు తమ బలగాలను పంపుతోంది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ అప్రమత్తమయ్యారు. దేశంలోని రిజర్వ్ భద్రతాబలగాలను సిద్ధం చేస్తున్నట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
అయితే బలగాలను మొత్తం రంగంలోకి దింపాల్సిన అవసరం ప్రస్తుతం లేదని ఆయన అన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
"ఉక్రెయిన్‌లోని మొత్తం బలగాలను మోహరించాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుత బలగాలకు మరికొంత మంది రిజర్వ్ స్టాఫ్‌ను జత చేయాల్సిన అవసరం ఉంది."
-- వొలొడిమిర్ జెలెన్‌స్కీ , ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 2లక్షల 50వేల మంది సైనికబలగాలు ఉండగా.. లక్షా40వేల మంది రిజర్వ్ సిబ్బంది ఉన్నారు.
మరోవైపు రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా కీలక వ్యాఖ్యలు చేశారు.
"దురాక్రమణలో చిన్నా పెద్దా అని ఉండదు. ప్లాన్ ఏ అంటే దౌత్యపరంగా అన్నింటినీ వినియోగించడం. ప్లాన్ బీ అంటే దేశంలోని ప్రతి అంగళాన్ని కాపాడుకోవడం కోసం పోరాడటం. గెలిచేవరకూ పోరాడటం." అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా అన్నారు.
ఇదీ చూడండి: దూకుడు పెంచిన రష్యా- కళ్లెం వేసే యత్నాల్లో ప్రపంచ దేశాలు