Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులను కట్టడి చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఇటీవల భారత్ మద్దతు కోరారు. తాజాగా మరోసారి ఉక్రెయిన్ భారత్ మద్దతు కోరింది. రష్యాతో భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్న కారణంగా తమ దేశంపై చేస్తున్న దాడులను ఆపమని పుతిన్ సర్కారును భారత్ కోరాలని ఉక్రెయిన్ విదేశాంగ దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. భారత్ సహా ప్రపంచ దేశాలు రష్యాపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు.
"ఈ యుద్ధానికి ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకమని రష్యా మిత్ర దేశాలన్నీ పుతిన్‌కు విజ్ఞప్తి చేయాలి. ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ యుద్ధం ఇలా కొనసాగితే పంటలు పండించలేము. ఇది అంతర్జాతీయంగా కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టీ.. ఇవన్నీ పరిగణించి ఈ యుద్ధాన్ని ఆపేయడమే మంచిది."
-దిమిత్రో కులేబా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి
'కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నారు'
విదేశీ విద్యార్థులను, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జరిపిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని కులేబా ఆరోపించారు. వారిని తరలించేవరకు కాల్పులు ఆపాలని రష్యాకు విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్యార్థుల తరలింపుపై రష్యా దుష్ప్రచారాన్ని చేస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఆపరేషన్ గంగ పేరుతో కేంద్రం స్వదేశానికి తీసుకువస్తోంది. ఇప్పటివరకు 63 విమానాల్లో సుమారు 13,300 మందికిపైగా సురక్షితంగా భారత్ చేరుకున్నట్లు విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది.
ఇదీ చూడండి : Putin warns NATO: 'అలా చేస్తే మాతో యుద్ధానికి దిగినట్టే'