కరోనా వ్యాక్సిన్ డోసులను ముందుగానే భారీ ఎత్తున కొనుగోలు చేస్తోంది యూకే ప్రభుత్వం. ఈ మేరకు గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్కే), ఫ్రాన్స్‌కి చెందిన సనోఫీ పాశ్చర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థలు అభివృద్ధి చేస్తున్న ప్రయోగాత్మక టీకా 60 మిలియన్ల (ఆరు కోట్లు) డోసులు అందించేలా ఈ ముందస్తు ఒప్పందం చేసుకుంది.
ఫలితంగా.. హ్యూమన్ ట్రయల్స్‌లో జీఎస్కే, సనోఫీ వ్యాక్సిన్ క్యాండిడేట్లు సమర్థమని తేలితే.. ముందస్తుగానే యూకే వాటిని సొంతం చేసుకునే వీలుంటుంది. తద్వారా వైరస్ ముప్పు అధికంగా ఉన్నవారికి ముందుగానే వ్యాక్సిన్ అందించే అవకాశం లభిస్తుంది.
"ఇంతకుముందు ఎన్నడూ చూడనంత వేగంతో సురక్షితమైన, ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను మా శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నారు. ఇది గొప్ప పురోగతి అయినప్పటికీ.. దీనికి ఎలాంటి హామీలు లేవు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు జీఎస్కే, సనోఫీ వంటి వ్యాక్సిన్ క్యాండిడేట్లను ముందుగానే పొందడం చాలా ముఖ్యం."
-అలోక్ శర్మ, యూకే వాణిజ్య మంత్రి
తాజా ఒప్పందంతో యూకే ప్రభుత్వం ఇప్పటివరకు 250 మిలియన్ల డోసులను సిద్ధం చేసుకున్నట్లైంది. ఇదివరకే బయోఎన్‌టెక్/ఫైజర్, వాల్నీవా, ఆస్ట్రాజెనెకా వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది బ్రిటన్.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం ఈ రెండు సంస్థల సొంతం. డీఎన్ఏ ఆధారిత సాంకేతికత ద్వారా ఈ 60 మిలియన్ల డోసులను తయారు చేయనున్నాయి సంస్థలు. సనోఫీ సంస్థ ఫ్లూ వ్యాక్సిన్‌ను తయారు చేసిన పద్ధతిలోనే వీటిని ఉత్పత్తి చేయనుంది.
మరోవైపు.. భవిష్యత్తులో జరిగే వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు 72 వేల మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ప్రభుత్వం పేర్కొంది. భారీ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం కోసం అక్టోబర్ నాటికి 5 లక్షల మందిని సమీకరించడానికి ప్రయత్నిస్తుంది.
ఇదీ చదవండి- 9 కోట్ల వ్యాక్సిన్ డోసుల కొనుగోలుకు బ్రిటన్ డీల్