Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి క్యారీ సైమండ్స్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తమకు లండన్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని ఓ ఆసుపత్రిలో శిశువు జన్మించిందని.. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు విల్ఫ్రెడ్ అనే చిన్నారికి జన్మనిచ్చారు. ప్రస్తుత సంతానంతో కలిపి 57 ఏళ్ల జాన్సన్‌కు ఏడుగురు సంతానం ఉన్నారు.
క్రిస్మస్ సందర్భంగా తమ ఇంటికి "రెయిన్బో బేబీ" వచ్చిందని బోరిస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
భారత సంతతికి చెందిన మాజీ భార్య మెరీనా వీలర్‌తో విడాకులు తీసుకున్న అనంతరం క్యారీని మూడో వివాహం చేసుకున్నారు జాన్సన్. ఈ ఏడాది ప్రారంభంలో క్యారీ జాన్సన్‌కు గర్భస్రావం జరిగింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఆ సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఐదో శిశువు..
గత 170 ఏళ్లలో పదవిలో ఉన్న ఓ బ్రిటిష్ ప్రధానికి జన్మించిన ఐదో శిశువుగా జాన్సన్ కుమార్తె రికార్డులకెక్కింది.
- టోనీ బ్లెయిర్ పదవిలో ఉన్న సమయంలోనే ఆయన సతీమణి 2000 మేలో లియోకు జన్మనిచ్చారు.
- డేవిడ్ కామెరాన్ భార్య సమంతా.. ఫ్లోరెన్స్ అనే కుమార్తెతు జన్మనిచ్చారు.
- 19వ శతాబ్దంలో ప్రధానమంత్రిగా పనిచేసిన లార్డ్ జాన్ రస్సెల్ దంపతులు పదవిలో ఉండగానే ఒక బిడ్డకు జన్మనిచ్చారు.
- గతేడాది ఏప్రిల్‌లో జాన్సన్-క్యారీ దంపతులు విల్ఫ్రెడ్ అనే చిన్నారికి జన్మనిచ్చారు.
ఈ ఏడాది మే నెలలో 56ఏళ్ల బోరిస్ జాన్సన్.. తన ప్రేయసి క్యారీ సైమండ్స్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఇవీ చదవండి: