బ్రిటన్కు చెందిన 50 జాతీయ వైద్య సేవ(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రులు కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమయ్యాయి. ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదముద్ర వేసిన బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. బెల్జియం నుంచి ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసులు బ్రిటన్కు చేరుకున్నాయని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. సురక్షితమైన ప్రదేశాల్లో వీటిని నిల్వ చేసినట్లు తెలిపింది.
కరోనాపై పోరాడుతున్న వైద్య సేవల సిబ్బంది, 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, కేర్ హోమ్ వర్కర్లకు ముందుగా టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా టీకా పంపిణీని చరిత్రలో అతిపెద్ద ఇమ్యునైజేషన్ కార్యక్రమంగా అభివర్ణిస్తోంది.
"కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్న నేపథ్యంలో వచ్చే వారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వైరస్ను అణచివేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి. ఎన్హెచ్ఎస్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సమయంలో ప్రజలంతా స్థానిక నిబంధనలు పాటించాలి."
-మాట్ హాన్కాక్, బ్రిటన్ వైద్య శాఖ మంత్రి
తొలి విడతలో భాగంగా ఎంపిక చేసిన 50 కేంద్రాలలో టీకా పంపిణీ కార్యక్రమం జరగనుందని వైద్య, సామాజిక సంరక్షక శాఖ(డీహెచ్ఎస్సీ) తెలిపింది. మంగళవారం నుంచి టీకాలు అందించనున్నట్లు వెల్లడించింది. క్రమంగా మరిన్ని ఆస్పత్రులలో టీకా సరఫరాకు ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
పలు మీడియా కథనాలను బట్టి బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ సైతం వ్యాక్సిన్ స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.