బ్రిటన్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వేసవి కాలంలో తగ్గుముఖం పట్టిన కేసులు.. శీతాకాలం మొదలయ్యేసరికి విపరీతంగా పెరుగుతున్నాయి. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న మార్చి నెల కంటే ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యే అధికంగా ఉండటం పట్ల ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త లాక్డౌన్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆయా నగరాల్లో మూడు విధానాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న నిబంధనలను అర్థం చేసుకునేందుకు క్లిష్టంగా ఉన్నందు వల్లే కొత్త విధానాలు రూపొందించినట్లు వివరించారు.
- కరోనా తీవ్రత ఆధారంగా మీడియం, హై, వెరీ హై అనే మూడు స్థాయిల్లో హెచ్చరిక వ్యవస్థను రూపొందించింది ప్రభుత్వం. మీడియం స్థాయిలో ప్రస్తుత నిబంధనలే అమల్లో ఉంటాయని బోరిస్ చెప్పారు. ఈ ప్రాంతాల్లో ఆరుగురి కంటే ఎక్కువ మంది గుమికూడేందుకు వీల్లేదు. 10మందికి మించి ఆతిథ్యం ఇవ్వొద్దు.
- 'హై' లెవెల్ ఆంక్షలు ప్రస్తుత లాక్డౌన్ నిబంధనల్లాగే ఉంటాయి. ఇంగ్లాండ్ వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వీటి ప్రకారం ఒకరి ఇంట్లోకి మరొకరు కుటుంబంతో వెళ్లడనికి వీల్లేదు.
- వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 'వెరీ హై' స్థాయి ఆంక్షలు అమలు చేస్తారు. ఈ ప్రాంతాల్లో బార్లు, పబ్బులకు అనుమతి లేదు. ప్రజలు ఇతరుల ఇళ్లకు, ప్రైవేట్ గార్డెన్లకు వెళ్లడానికి వీల్లేదు. ఇతర ప్రాంతాలకు ప్రయాణించకూడదు.
కరోనా కేసులు అధికంగా ఉన్న లివర్‌పూల్ నగరంలో బుధవారం నుంచి 'వేరీ హై' లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు బోరిస్ తెలిపారు.
బ్రిటన్‌లో సోమవారం కొత్తగా 13,972 కేసులు వెలుగు చూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,17,688కి చేరింది. ఇప్పటివరకు 42,965మంది వైరస్‌కు బలయ్యారు.