Boris Johnson apology: తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కొవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి సిబ్బందితో కలిసి విందులు జరుపుకున్న వ్యవహారంలో బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం క్షమాపణలు కోరారు. 'పార్టీగేట్‌గా వెలుగు చూసిన ఈ ఆరోపణలపై ప్రాథమిక దర్యాస్త నివేదిక వచ్చిన నేపథ్యంలో పార్లమెంటులోని దిగువ సభలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. తప్పిదాలను సరి చేసుకుంటానని హామీ ఇచ్చారు. తన ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని విజ్ఞప్తి చేశారు. పదవి నుంచి వైదొలగాలంటూ విపక్షం, సొంత పార్టీలో కొందరు సభ్యులు చేస్తున్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. ప్రధాని, ఆయన కార్యాలయ సిబ్బంది కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒకేచోట గుమిగూడి విందులు జరుపుకోవడాన్ని దర్యాప్తు అధికారిణి సీనియర్ సివిల్ సర్వెంట్ సూ గ్రే తన నివేదికలో తీవ్రంగా తప్పుపట్టారు. నాయకత్వ వైఫల్యంగా అభివర్ణించారు. అటువంటి విందులను అనుమతించాల్సింది కాదని పేర్కొన్నారు.
దేశ ప్రజలపై కరోనా ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తున్న సమయంలో ప్రధాని, ఆయన కార్యాలయ సిబ్బంది వాటిని ఉల్లంఘించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. 2020, 20లలో ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలు, ఇతర విందు లపై ఆమె దర్యాప్త జరిపారు. మొత్తం 16 సందర్భాల్లో ప్రధాని కార్యాలయ సిబ్బంది లాక్‌డౌన్ ఆంక్షలను ధిక్కరిస్తూ విందులు జరుపుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో నాలుగింటిపై దర్యాప్తు నివేదిక వెలువడింది. మిగిలిన 12 విందులపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసుల దర్యాప్త కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్‌లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు ముందు రోజు కూడా ప్రధాన మంత్రి కార్యాలయ సిబ్బంది మద్యంతో విందు జరుపుకున్నారనే విషయం గత నెలలో పత్రికల్లో రావడంతో బోరిస్ జాన్సన్ ఇప్పటికే ఒకసారి పార్లమెంటులో క్షమాపణ చెప్పారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: కంట్రోల్ తప్పిన రాకెట్.. అస్తవ్యస్తంగా చక్కర్లు.. మార్చిలో చంద్రుడ్ని ఢీ!