ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు మరోసారి తిరస్కరించింది. పార్లమెంటు దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 321 ఓట్లు, అనుకూలంగా 278 ఓట్లు నమోదయ్యాయి. 43 ఓట్ల ఆధిక్యంతో ప్రధాని థెరిసా ప్రతిపాదన వీగిపోయింది. అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 75 మంది ఎంపీలు ప్రధాని థెరిసా మే ప్రతిపాదించిన ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. బ్రెగ్జిట్ ఒప్పంద ప్రక్రియకు మరో రెండు వారాలు (మార్చి 29) మాత్రమే గడువుంది.
బ్రెగ్జిట్ ప్రతిపాదన వీగిపోయిన నేపథ్యంలో, బ్రెగ్జిట్ ఒప్పంద గడువును పెంచేందుకు వీలుగా ఆర్టికల్-50ని పొడిగించేందుకు సభలో తీర్మానం ప్రవేశ పెడతామని ప్రధాని తెలిపారు. ఇది ఆమోదం పొందితే థెరిసా మే ఐరోపా సమాఖ్యతో చర్చలు జరిపి ఒప్పందంలో మార్పులు చేసుకునే వీలుంటుంది.
బ్రెగ్జిట్ ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయాలో సభలో నిర్ణయం తీసుకోకపోతే గడువు పెంచినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు మే.
" మన ముందున్న అవకాశాల్లో దేన్ని ఎంపిక చేయాలో సభ నిర్ణయించాలి.. చట్టపరమైన ఒప్పందం ప్రకారం ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ ఎలాంటి ఒప్పందం లేకుండానే వైదొలుగుతుంది. ప్రత్యామ్నాయ మార్గాన్ని సభ్యులే కనుగొనాలి. ప్రస్తుతం మన ముందున్న మార్గాలు.. గత రెండేళ్లుగా సాగుతున్న చర్చల ప్రకారం ఎలాంటి ఒప్పందం లేకుండా విడిపోవడం. రెండోది ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ఒప్పందానికి సవరణలు చేయడం. కాని అది బ్రెగ్జిట్ ఒప్పందాన్నే ప్రశ్నార్థకం చేసే ప్రమాదముంది. అలా జరిగితే బ్రిటన్ ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసినట్లవుతుంది. చట్టసభ సభ్యులకు ప్రజలకు మధ్య విశ్వాసం సన్నగిల్లుతుంది."
-థెరిసా మే, బ్రిటన్ ప్రధాని
మార్పులు లేకుండా బ్రెగ్జిట్ ఒప్పందానికి మద్దతు తెలిపే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రతిపక్ష నేతలు తేల్చి చెప్పారు. థెరిసా మే ప్రతిపాదనలను వ్యతిరేకించారు.
"ఎలాంటి ఒప్పందం లేకుండా వైదొలగడాన్ని సభ మరోసారి తిరస్కరించింది. ప్రధాని ప్రతిపాదనలను సభ్యులు వ్యతిరేకించారు. ఒకవేళ ఆర్టికల్ 50ని తప్పని సరిగా పొడిగించాలనుకుంటే దానికి పూర్తి బాధ్యత ప్రధానే వహించాల్సి ఉంటుంది. ఎలాంటి పరిష్కారం లేకుండా ఆర్టికల్-50ని పొడిగించినా ప్రయోజనం ఉండదు. కచ్చితంగా పార్లమెంటులోనే పరిష్కారాన్ని కనుగొనాలి. "
-జెరెమీ కార్బిన్, ప్రతిపక్ష నేత