ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణకు వివిధ దేశాలు కొత్తగా ఆంక్షలు విధిస్తున్నాయి. పలు దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.
పాక్‌లో సమావేశాలపై ఆంక్షలు..
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఏప్రిల్ 5 నుంచి సమావేశాలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాజిటివిటీ రేటు 8 శాతంకన్నా ఎక్కువగా ఉంటే.. ఆయా ప్రాంతాల్లో వివాహ వేడుకలన్నింటిపైనా నిషేధం విధించాలని సూచించింది. అత్యవసరం అనుకుంటే ఏప్రిల్ 5 కన్నా ముందే ఆంక్షలు అమలు చేసేందుకు స్థానిక యంత్రాంగానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 6,54,591 కేసులు నమోదయ్యాయి. 14,215 మంది మరణించారు.
బ్రిటన్‌లో ఆంక్షల సడలింపులు..
ఐరోపాలోని పొరుగుదేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. లాక్‌డౌన్‌పై బ్రిటన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పక్క దేశాలతో పోలిస్తే.. వ్యాక్సినేషన్ రేటు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ 'స్టే ఎట్ హోం' నిబంధనలను కాస్త సడలించారు. దీనితో ఆరుగురికి మించకుండా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులను కలిసేందుకు వీలు కలగనుంది. గోల్ఫ్, టెన్నిస్, బాస్కెట్ బాల్ వంటి ఆటలకు కూడా వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం.
స్కాట్లాండ్, వేల్స్, నార్తన్ ఐర్లాండ్‌లు కూడా ఇంచు మించు ఇలాంటి సడలింపులే ఇచ్చాయి.
ఫ్రాన్స్‌లో డాక్టర్ల హెచ్చరిక..
కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యవసర సేవలందించే డాక్టర్లు ప్రజలు, ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. కేసులు ఇదే స్థాయిలో పెరిగితే.. పారిస్‌లో సామర్థ్యానికి మించి రోగులు చేరొచ్చని తెలిపారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇమాన్యుయల్ మేక్రాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది జనవరి నుంచి లాక్‌డౌన్‌కి బదులు.. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. మరో మారు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండబోదని చెబుతోంది.
ఇదీ చదవండి:లాక్డౌన్ వద్దంటూ బ్రిటన్‌లో హింస