నైపుణ్యం గల వైద్యులు, నర్సుల కోసం నూతన వీసా ప్రవేశపెట్టడానికి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫాస్ట్‌ట్రాక్ వీసాల వల్ల భారత్ సహా ప్రపంచ దేశాల్లోని అనేక మంది లబ్ధి పొందే అవకాశముంది. ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ వైద్య సేవా పథకం(ఎన్‌హెచ్ ఎస్)లో నైపుణ్యమున్న వారిని ఉపయోగించుకోవాలని చూస్తోంది బ్రిటన్.
ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని బోరిస్ జాన్సన్ ఎన్నికల ప్రచారాల్లో అనేకమార్లు ఈ ఎన్హెచ్ఎస్ వీసాను ప్రస్తావించారు. తాజాగా ఆ దేశ రాణి ఎలిజబెత్-2 పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో ఈ వీసా విషయంపై స్పష్టత వచ్చింది.
"జాతీయ వైద్య సేవా పథకంలో పాల్గొనే వారికి సహాయంగా కొత్త వీసాను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీని ద్వారా అర్హత కలిగిన వైద్యులు, నర్సులు, వైద్య నిపుణులకు బ్రిటన్‌కు సత్వరమే రాగలుగుతారు. నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఆహ్వానించడం ద్వారా యూకే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మరింత తోడ్పడుతుంది."-ఎలిజబెత్-2, బ్రిటన్ రాణి
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగిన తర్వాత ఈ కొత్త వీసాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. ఎన్హెచ్ఎస్ నుంచి ఉద్యోగ ఆఫర్ పొందిన నైపుణ్యం గల వైద్యులు, నర్సులు, ఆరోగ్య నిపుణులకు ఈ ఫాస్ట్‌ట్రాక్ వీసాలు లభిస్తాయి.