కరోనా వ్యాక్సిన్ ప్రయోగాత్మక డోసులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆక్స్ఫర్డ్ టీకాకు సంబంధించి ఆస్ట్రాజెనికాతో ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటన్.. తాజాగా మరో మూడు సంస్థల నుంచి టీకా కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఫార్మా దిగ్గజం ఫైజర్ సహా ఇతర సంస్థలు అభివృద్ధి చేస్తున్న టీకాల 9 కోట్ల డోసుల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై సంబంధిత అధికారులు సంతకం చేసినట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
లక్షల మందికి టీకాలు
ఫైజర్, బయో ఎన్టెక్ సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ క్యాండిడేట్ సహా ప్రయోగాత్మక దశలో ఉన్న వాల్నీవా టీకాలను దక్కించుకున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. వీటి ద్వారా లక్షలాది మందికి టీకాలు అందించవచ్చని పేర్కొంది.
వ్యాక్సిన్ సమర్థతపై పూర్తిగా స్పష్టత రానప్పటికీ.. బ్రిటన్ సహా ఇతర ధనిక దేశాలు టీకా ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. వ్యాక్సిన్ ప్రయోగాలు సఫలమైతే భారీ స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రస్తుతం డజనుకు పైగా సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి.
10 కోట్ల డోసులు
ఇప్పటికే ఆస్ట్రాజెనికా అనే సంస్థతో బ్రిటన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ 10 కోట్ల డోసులను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి- వారానికి రెండురోజులు పూర్తిస్థాయి లాక్డౌన్