కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా 'డెక్సమెథసోన్' అనే జనరిక్ ఔషధం కరోనా రోగుల్లో మరణాల తీవ్రతను తగ్గిస్తున్నట్లు ప్రాథమిక ప్రయోగాల్లో నిరూపితమైందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ మధ్యే ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కూడా దీన్ని ధ్రువీకరించి.. కరోనా ఔషధ పురోగతిలో ఇది గొప్ప విషయమంటూ బ్రిటన్ శాస్త్రవేత్తలను ప్రశంసించింది.
మొదటి ఔషధం
'ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగుల మరణాల సంఖ్యను తగ్గించడంలో ఉపయోగపడుతున్న మొదటి ఔషధం ఇదే,' అని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ప్రకటించారు. అనేక మంది ప్రజలను కాపాడగలిగే ఈ ఔషధం ప్రయోగాల్లో.. పురోగతి సాధించేందుకు కృషిచేసిన బ్రిటన్ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌ను అభినందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. వీరితోపాటు ఈ పురోగతికి దోహదపడిన ఆసుపత్రులు, రోగులను కూడా అభినందిస్తున్నామని తెలిపారు.
డెక్సమెథసోన్ ఔషధం ప్రయోగ ఫలితాల గురించి బ్రిటన్ శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులతో పంచుకున్న అనంతరం డబ్ల్యూహెచ్‌ఓ ఈ ప్రకటన చేసింది. దీనిపై మరింత విశ్లేషణ అనంతరం పూర్తి సమాచారం ఇస్తామని తెలిపింది. అయితే ఈ ఔషధాన్ని కొవిడ్ రోగులు ఎలా, ఎప్పుడు వినియోగించాలి? అనే విషయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ప్రయోగ మార్గదర్శకాల్లో త్వరలోనే పొందుపరుస్తామని తెలిపింది.
అతి తక్కువ ధరకు లభించే ఈ ఔషధం కొవిడ్-19తో బాధపడుతూ వెంటిలేటర్‌పై ఉన్నవారికి ఆక్సిజన్‌లా పనిచేస్తోందని ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మార్టిన్ లాండ్రే ఇటీవలే వెల్లడించారు. ఈ జనరిక్ ఔషధం వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నట్లు ప్రయోగాల్లో గుర్తించామని మరో పరిశోధకుడు పీటర్ హార్బీ తెలిపారు.
బ్రిటన్ ప్రధాని హర్షం..
డెక్సమెథసోన్ను కొవిడ్ రోగుల చికిత్సకు అధికారికంగా ఉపయోగించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది. బ్రిటిష్ శాస్త్రవేత్తలు సాధించిన ఈ ఘనత గర్వకారణని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు.