Russia Ukraine: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఫాక్స్ న్యూస్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు దుర్మరణం చెందారు. ఆ ప్రాంతంలో కవరేజ్ కోసం వెళ్లిన వారి వాహనంపై బాండు దాడి జరిగి మంటల్లో చిక్కుకోవడం వల్ల ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరి పేర్లు పీర్రె జక్జెవ్స్కీ(వీడియోగ్రాఫర్), ఒలెక్ సాండ్రా(24). క్షేత్రస్థాయి పరిస్థితుల్ని టీవీ ద్వారా ప్రజలకు చూపేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టిన వీరి మృతికి ఫాక్స్ న్యూస్ సీఈఓ సుజానే స్కాట్ సంతాపం తెలిపారు. వీరిద్దరు రిపోర్టర్ బెంజమిన్ హిల్తో పాటు వెళ్తుండగా సోమవారం ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
ఆదివారం నాడు రష్యా బలగాలు జరిపిన దాడుల్లో డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ బ్రెంట్ రినాడ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. కీవ్ బయట ఇర్పిన్లో ఈ ఘటన జరిగింది. రష్యా దళాలు ఆయన వాహనంపై తూటాల వర్షం కురిపించాయి. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంపై వార్తా సంస్థల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది.
Russia Ukraine conflict
ఆస్పత్రిలో 500 మంది నిర్బంధం..
ఉక్రెయిన్‌పై భీకర దాడులు కొనసాగిస్తున్న రష్యా దళాలు మరియుపోల్‌లో ఓ ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్నాయి. అంతేగాక 500 మందిని అందులో నిర్బంధించినట్లు ఉక్రెయిన్ ప్రాంతీయ నాయకుడు పావ్లో కిరిలెంకో తెలిపారు. 400 మంది చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పౌరులను ఇళ్ల నుంచి రష్యా బలగాలు వాహనాల్లో ఆస్పత్రి భవనానికి తీసుకెళ్లాయని, 100 మంది వైద్యులు, రోగులను కూడా దిగ్భంధంలో ఉంచినట్లు చెప్పారు. నిర్బంధించిన వారిని మానవ కవచాలుగా రష్యా దళాలు ఉపయోగించుకుంటున్నాయని, ఎవరినీ బయటకు రానివ్వడం లేదని పేర్కొన్నారు.
20వేల మంది
కీవ్ నగరాన్ని రష్యా బలగాలు ముట్టడిస్తున్న తరుణంలో ప్రజలు ప్రాణభయంతో దేశం వీడి పారిపోతున్నారు. మంగళవారం 20,000 మంది పౌరులు మరియుపోల్ నుంచి మానవతా కారిడార్ ద్వారా తరలిపోయారు. రష్యా దళాలు కీవ్‌పై బాంబులతో విరుచుకుపడుతుండటం చూసి వెళ్లిపోతున్నారు.
US Congress Putin
పుతిన్‌పై తీర్మానం..
ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి భీకర దాడులకు కారణమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విచారణ జరపాలనే తీర్మానానికి అమెరికా సెనేట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌లో హింసకు పుతినే కారణమని, ఆయన సూచనల మేరకే ఆ దేశ సైన్యం దాడులు చేస్తోందని తీర్మానం పేర్కొంది.
అమెరికా కాంగ్రెస్‌లో జెలెన్స్కీ ప్రసంగం..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ బుధవారం అమెరికా కాంగ్రెస్‌లో వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. రష్యా తమదేశంపై దాడులు చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం విజ్ఞప్తి చేయనున్నారు.
Canada Sanctions on russian officials
రష్యాపై ఆంక్షలు..
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినందుకు మరో 15 మంది రష్యా అధికారులపై ఆంక్షలు విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ప్రకటించారు. ఇందులో మిలిటరీ అధికారులు కూడా ఉన్నారు. ఇందుకు ప్రతిగా కెనడా ప్రధాని సహా.. 300మంది అధికారులపై ఆంక్షలు అమలు చేస్తున్నట్లు రష్యా కూడా ప్రకటించింది.
Biden europe tour
ఐరోపాకు బైెడెన్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చేవారం ఐరోపా వెళ్లనున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐరోపా దేశాల నాయకులతో ఆయన మాట్లాడుతారని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జెన్ సాకీ వెల్లడించారు. మార్చి 24న జరిగే నాటో సమావేశంలో పాల్గొంటారని, ఐరోపా సమాఖ్య సమావేశానికి కూడా హజరవుతారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సాయం, రష్యాపై మరిన్ని ఆంక్షలు వంటి అంశాలపై ఐరోపా నాయకులతో బైడెన్ చర్చించనున్నారు.
Europe leaders in kyiv
ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధానులు..
కీవ్నగరంపై రష్యా భీకర దాడులు చేస్తున్నప్పటికీ పోలండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేనియా దేశాల ప్రధానులు మంగళవారం ఆ నగరానికి వెళ్లారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నామని చెప్పేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వీరి భద్రతపై ఐరోపా సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ రైలు ప్రయాణం చేసి కీవ్ చేరుకున్నారు. రష్యా యుద్ధం ప్రకటించడం వల్ల ప్రపంచ దేశాలు భద్రతా భావాన్ని కోల్పోయాయని, అమాయక ప్రజలు ప్రాణాలు, ఆస్తులు కోల్పోతున్నారని పోలండ్ ప్రధాని మాట్యుస్ మొరవీకి మంగళవారం సాయంత్రం ఫేస్బుక్లో చెప్పారు. కీవ్ నుంచే ఈ పోస్టు చేశారు.
అమెరికా హామీ..
రష్యా సేనలను దీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు అన్నివిధాలుగా అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి ప్రకటించారు. ఆయుధాలు సరఫరా చేయటంతోపాటు ఆ దేశ శరణార్థులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. కీవ్‌కు ఆర్థిక సహకారంతోపాటు ఆహారం, ఇతర మానవతా సాయం అందిస్తామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మిత్రదేశాలు, భాగస్వాములతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అదనపు ఆయుధాలు, పరికరాల కోసం ఇటీవల 200 మిలియన్ డాలర్ల సాయం అందించారు. ఉక్రెయిన్‌కు 2021 జనవరి నుంచి ఇప్పటివరకు 1.2బిలియన్ డాలర్ల రక్షణసాయం అమెరికా అందించినట్లు బైడెన్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: దూకుడు పెంచిన రష్యా.. క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్న కీవ్