Time of day effects vaccine efficacy: కొవిడ్ టీకా ఉదయం పూట తీసుకున్న వారి కన్నా.. మధ్యాహ్నం తీసుకున్న వారిలో యాంటీబాడీ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు ఓ పరిశీలనాత్మక అధ్యయనం వెల్లడించింది.
జర్నల్ ఆఫ్ బయోలాజికల్ రిథమ్.. ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. మనిషి సర్కాడియన్ క్లాక్(24గంటల కాలచక్రం)లో.. శరీరంపై వ్యాధి, టీకా ప్రభావానికి కూడా తగిన సమయం ఉంటుందని పేర్కొంది.
"కొవిడ్ టీకాపై రోగనిరోధక శక్తి స్పందన.. రోజులో ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నామనే అంశంపైనా ఆధారపడి ఉంటుందని మా అధ్యయనంలో తేలింది. టీకా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు మా పరిశోధన ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము."
---ఎలిజబెత్ క్లెర్మన్, సహ రచయిత్రి.
వ్యాధి లక్షణాలు, వాటిపై మెడికేషన్ ప్రభావం కూడా 'సమయం'పైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు పరిశోధకులు. ఉదాహరణకు.. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న రోగులకు.. లక్షణాల తీవ్రత, శ్వాస తీసుకునే ప్రక్రియలో ఇబ్బందులు.. రోజులో ప్రత్యేకంగా కొన్ని సమయాల్లోనే వస్తాయని పేర్కొన్నారు.
బ్రిటన్లో.. టీకాలు తీసుకున్న 2,190మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరిశోధన జరిగింది. టీకా తీసుకున్న సమయంలో ఎలాంటి లక్షణాలు లేని ఆరోగ్య కార్యకర్తల రక్త నమూనాలను సేకరించారు. టీకా తీసుకున్న సమయం, టీకా రకం, వయస్సు, లింగం ఆధారంగా యాంటీబాడీ స్థాయిల ప్రభావాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం తర్వాత టీకాలు తీసుకున్న వారందరికీ యాంటీబాడీల స్పందన ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
ఇదే విషయంపై గతంలోనూ ఓ పరిశోధన జరిగింది. అందులో ఉదయం పూట టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీల స్పందన ఎక్కువగా ఉన్నట్టు తేలింది. పలువురు వృద్ధులపై ఈ పరిశోధన జరిగింది. అయితే అప్పుడు వారికి వేసింది కొవిడ్ టీకా కాదు.
ఇవీ చూడండి:- యాంటీబాడీ టెస్టు ఏంటి? ఎందుకోసం?