బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే తన చివరి ప్రజా పర్యటనను పూర్తి చేశారు. రెండో ప్రపంచ యుద్ధానికి సైనిక చర్యలు ప్రారంభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్‌లోని నార్మండేలో జరిగిన డీ-డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
1944లో జూన్ 6న జర్మనీని ఎదుర్కొనేందుకు ఐరోపా దేశాలు సైనిక చర్యలను ప్రారంభించింది నార్మండే నుంచే.
ఈ సందర్భంగా ప్రపంచ యుద్ధంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు మే. సైనికుల గురించి మాట్లాడటం గర్వంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. అప్పటి సైనికుల కాలాన్ని ఓ ప్రత్యేకమైన, గొప్ప తరంగా ఆమె అభివర్ణించారు.
నేడు అధికారికంగా తప్పుకోనున్న థెరిసా
జూన్ 7న థెరిసా మే అధికారికంగా బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నారు. గత నెలలోనే డౌనింగ్ స్ట్రీట్ (బ్రిటన్ పాలకులు నివాసం ఉండే వీధి)ని వీడేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.
థెరిసా తర్వాత బ్రిటన్ ప్రధాని పీఠం దక్కించుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ నుంచి 11 మంది ఎంపీలు పోటీ పడుతున్నారు. ఈ రేసులో విదేశాంగ మాజీ కార్యదర్శి బోరిస్ జాన్సన్ ముందు వరుసలో ఉన్నారు. అయితే అధికారికంగా దీనిపై నిర్ణయం వెలువడాల్సి ఉంది.
"బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చలేకపోయాననే అసంతృప్తి నాలో మిగిలిపోయింది. ఇది ఎప్పటికీ నాకు విచారకరంగానే అనిపిస్తుంది. నా తర్వాత.. బాధ్యతలు చేపట్టే ప్రధాని బ్రెగ్జిట్‌ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను." - థెరిసా మే, బ్రిటన్ ప్రధాని