కొవిడ్ రోగి రక్తంలోని తెల్ల రక్తకణాలను ప్రత్యేక డయాలసిస్‌తో సవరించి రోగ నిరోధక వ్యవస్థ అతిగా పనిచేయకుండా చేసే చికిత్సను లండన్‌లోని లాసన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ బృందం చేసింది. కొవిడ్-19తో తీవ్ర అనారోగ్యానికి చేరిన వారిలో రోగ నిరోధక ప్రతిస్పందన అవసరానికి మించి పెరుగుతోంది. దీన్నే ‘సైటోకైన్ స్ట్రోమ్’ అంటారు. ఈ హైపర్ ఇన్‌ప్లమేటరీ స్థితిని పరిష్కరించే చికిత్సలు, అవసరమైన ఔషధాలు పరిమితంగా ఉన్నాయి. ఇందుకు పరిష్కారం కనుగొనేలా లండన్ హెల్త్ సైన్స్ సెంటర్‌లో తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న 40 మందిపై డయాలసిస్ ప్రయోగం చేశారు.
ఇందుకోసం స్టాండర్స్ డయలైజర్ పరికరాన్ని ఎక్స్‌ట్రాకార్పోరియల్ ల్యూకోసైట్‌గా మార్చారు. ఇది స్టాండర్స్ డయలైజర్ కంటే చాలా నెమ్మదిగా శరీరం నుంచి రక్తాన్ని సేకరిస్తుంది. నిర్ధిష్ట స్థాయిలో జీవరసాయనాలను ఉపయోగించి ఇన్‌ప్లమేషన్‌తో సంబంధం ఉన్న తెల్లరక్తకణాలను సవరించి తిరిగి శరీర రక్తప్రసరణలోకి విడుదల చేస్తుంది. ఇలా మార్చిన కణాలే హైపర్‌ఇన్‌ప్లమేషన్‌ను తగ్గించేలా పోరాడి ఊపిరితిత్తులను కాపాడతాయి. ఈ కొత్తతరహా చికిత్స ఫలితాల కోసం పరిశోధనా బృందం వేచిచూస్తోంది. 'అంతిమలక్ష్యం రోగి పరిస్థితిని మెరుగుపరచడం, వెంటిలేటర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడమే. ఈ చికిత్స ప్రభావవంతంగా ఉంటే ఇతర చికిత్సలతో కలిపి కొనసాగించే అవకాశం ఉంది' అని పరిశోధకులు చెప్పారు.