ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి ధాటికి అగ్రరాజ్యాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 4,68,905 మందికి వైరస్ సోకింది. 21, 200మంది మృతి చెందారు. కరోనా బారిన పడ్డవారిలో లక్షా 14వేల మంది కోలుకున్నారు. అందులో ఎక్కువ మంది చైనాకు చెందిన వారే కావడం గమనార్హం.
ఇటలీలో మరో 683మంది మృతి..
కరోనా విజృంభనతో ఇటలీ వణికిపోతోంది. రోజురోజుకు పెరిగిపోతున్న మరణాలు ఆ దేశ ప్రభుత్వాన్ని, పౌరులను మరింత కలవరపెడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 683మంది మృతి చెందారు. రెండు వారాలుగా అక్కడ లాక్డౌన్ కొనసాగుతోంది.
స్పెయిన్‌లో 738 మరణాలు..
స్పెయిన్‌లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. బుధవారం ఒక్కరోజే 738 మంది మరణించారంటే ఆ దేశంలో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చైనాలో నమోదు కాని కొత్త కేసులు
చైనాలో దేశీయంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే విదేశాల నుంచి వచ్చిన మరో 67మందికి వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. తాజాగా హుబెకు చెందిన మరో ఆరుగురు మృతి చెందారు.