సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం(Nobel prize 2021 in literature) ప్రముఖ నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాకు(టాంజానియా) దక్కింది. శరణార్థుల వెతలకు అక్షరరూపం ఇచ్చి.. కళ్లకు కట్టినట్లు రచనలు చేసినందున రజాక్‌కు నోబెల్ పురస్కారం అందిస్తున్నట్లు పేర్కొంది రాయల్ స్వీడిష్ అకాడమీ. ఆయనకు.. బంగారు పతకం, 11 లక్షల డాలర్ల నగదు బహుమతి అందజేయనుంది.
టాంజానియాలోని జాంజిబర్లో 1948లో జన్మించిన రజాక్.. 1960 చివర్లో ఇంగ్లాండ్‌కు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రసిద్ధ కెంట్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. గుర్నా.. ఇప్పటివరకు 10 నవలలు సహా ఎన్నో చిన్న చిన్న కథలు రచించారు. ఆయన రాసిన 'ప్యారడైజ్' అనే నవల 1994 మ్యాన్ బుకర్ ప్రైజ్‌కు షార్ట్ లిస్ట్ అయింది.
స్వతహాగా శరణార్థి అయిన రజాక్.. వలసవాదం వెతలు, శరణార్థుల జీవితాలను ప్రతిబింబించేలానే రచనలు చేశారు.
నోబెల్ సాహిత్య పురస్కారానికి(Nobel prize 2021 in literature) ఘన చరిత్రే ఉంది. గతేడాది అమెరికాకు చెందిన ప్రముఖ కవయిత్రి లూయిస్ గ్లక్‌కు ఈ రంగంలో నోబెల్ దక్కింది.
2018లో సాహిత్య నోబెల్‌పై(Nobel prize 2021 in literature) ఊహించని రీతిలో మచ్చ పడింది. విజేతను నిర్ణయించే స్వీడిష్ కమిటీలో లైంగిక వేధింపుల వార్తలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆ ఏడాది పురస్కారాన్ని వాయిదా వేశారు. 2018తో పాటు 2019ని కలిపి ఒకేసారి ఇచ్చారు.
భారత దేశానికి చెందిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1913లో నోబెల్ బహుమతి దక్కింది. ఆయన రచించిన గీతాంజలి కావ్యానికి.. ఈ పురస్కారం వరించింది. నోబెల్ సాహిత్య అవార్డు పొందిన తొలి ఆసియా వాసి ఠాగూర్.
ఈ ఏడాది వీరికే..
సోమవారం(అక్టోబర్ 4న) వైద్య శాస్త్రంలో (nobel prize medicine 2021) నోబెల్ బహుమతిని ప్రకటించగా.. అమెరికన్ శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటపౌటియన్‌లు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు.
భౌతిక శాస్త్రంలో(nobel prize 2021 physics) నోబెల్‌ను మంగళవారం ప్రకటించగా.. సుకురో మనాబే, క్లాస్ హాసిల్మేన్, జార్జియో పారిసీ దీనిని దక్కించుకున్నారు.
అసిమెట్రిక్ ఆర్గానోకెటాలిసిస్ను అభివృద్ధికి దోహదం చేసినందుకు.. రసాయన శాస్త్రంలో 2021కి గాను నోబెల్ బహుమతిని(nobel prize 2021 chemistry) బెంజమిన్ లిస్ట్, డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్ దక్కించుకున్నారు.
అక్టోబర్ 8న శాంతి బహుమతి, అక్టోబర్ 11న చివరగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటించనుంది రాయల్ స్వీడిష్ అకాడమీ.
ఇవీ చూడండి: భూతాపంపై పరిశోధనలు చేసిన వారికి నోబెల్