మానవాళికి అతిపెద్ద ముప్పుగా ఉగ్రవాదం కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం ఎప్పుడూ సమర్థనీయం కాదని మానవ హక్కుల సంస్థలు గ్రహించాలన్నారు. ఐరాస మానవ హక్కుల మండలి 46వ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారు.. బాధితులతో సమానం కాదని పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
" ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో భారత్ ముందు వరుసలో నిలుస్తూ వస్తోంది. ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా 8 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను గత నెల ఐరాసకు అందించింది భారత్. ఈ విధానాన్ని అమలు చేసేందుకు మేము ఇతర దేశాలతో కలిసి పనిచేస్తాం."
-- ఎస్. జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
కరోనా కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయన్నారు జైశంకర్. ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
కరోనాపై పోరులో వేర్వేరు దేశాలకు భారత్ చేసిన సాయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు జైశంకర్.
ఇదీ చదవండి : ' 'కొవాక్స్' కోసం భారత్ 1.1 బిలియన్ డోసులు'