ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కరోనా మహమ్మరి బారిన పడిన వేళ క్షేత్రస్థాయిలో సేవలందించే సిబ్బందికీ కరోనా ముప్పు ఉంటోంది. ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులు, నర్సులు సహా వైద్య సిబ్బందిని మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. పీపీఈ కిట్లు, సర్జికల్ మాస్క్‌లు లేక మహమ్మారి బారిన పడాల్సివస్తోంది.
అమెరికాలో న్యూయార్క్ కేంద్రంగా కరోనా మరణ మృదంగం సృష్టిస్తున్న వేళ... అక్కడి వైద్య సిబ్బంది రక్షిత పరికరాలు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్లు న్యూయార్క్ నర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు జూడీ శెరిడియన్ తెలిపారు. నిరంతర పనివేళలతో కొంతమంది జ్వరం బారిన పడగా.... వారికి నయమవగానే తిరిగి విధుల్లో చేరాలని ఆసుపత్రుల యజమాన్యాలు కోరుతున్నట్లు చెప్పారు. వారు విధుల్లో చేరే క్రమంలో తోటి సిబ్బందీకి మహమ్మారి బారిన పడే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. వైద్య సిబ్బందిలో వయసు పైబడిన వారి సమస్యలు మరింత దారుణంగా ఉన్నాయన్నారు.
ఆ దేశంలో తీవ్రం...
ఇటలీలో కూడా పదుల సంఖ్యలో వైద్యులు మహమ్మారి బారిన పడుతుండగా వందలాది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. పీపీఈ కిట్లు, మాస్క్‌లు లేక వారు అవస్థలు పడుతున్నారని రోమ్‌లోని ఓ ఆసుపత్రి నర్సింగ్ కో-ఆర్డినేటర్ తెలిపారు. 7 గంటల పనివేళల్లో దాదాపు 50 నిమిషాల పాటు కేవలం దుస్తులు ధరించడానికే సమయం పడుతోందని ఆమె చెప్పారు. చేతులు శుభ్రపరుచుకునేందుకు గంట సమయం పడుతోందని వాపోయారు.
కనీస సౌకర్యాలేవి?
దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లోనూ వందలాది మంది వైద్య సిబ్బందికి కరోనా మహమ్మారి సోకింది. పసిఫిక్ పోర్ట్ సిటీలోని ఓ నర్సు కొవిడ్ సోకిందని తెలిసే సరికే తన సహచరుల్లో 80 శాతం మంది కరోనా బారినపడ్డారు.
ఇప్పటికే కరోనా కారణంగా ఐరోపా వణుకుతుండగా కొవిడ్-19పై పోరాడుతున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించటం లేదని అక్కడి నర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు. కరోనా లక్షణాలతో ఈక్వెడార్ అత్యవసర విభాగానికి చాలా మంది బాధితులు.. వస్తున్నా వారిని పరీక్షించేందుకు కిట్లు లేవని ఆమె తెలిపారు. పీపీఈ కిట్లు లేకున్నా వారికి సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు.