అడ్డుఅదుపు లేకుండా ప్రపంచంపై విరుచుకుపడుతోన్న కరోనా వైరస్ ఐరోపాలో కాస్త నెమ్మదించింది. ఐరోపాలోని ప్రధాన దేశాలైన ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా మరణాల సంఖ్య తగ్గింది.
ఫ్రాన్స్‌లో ఆదివారం 357మంది వైరస్ ధాటికి మృతి చెందారు. ఈ వారంలో నిన్నే తక్కువ మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 28,891 మంది కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. 6,978 మంది ఇంటెన్సీవ్ కేర్‌లో ఉన్నట్లు తెలిపారు.
వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 17న ఫ్రాన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 70,478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అక్కడా ఇంతే...
ఇటలీలో గత రెండు వారాల్లో రెండోసారి తక్కువ మరణాలు సంభవించాయి. ఆదివారం 525 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. గతంలో మార్చి 19న అత్యల్పంగా 427 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు దేశంలో మృతుల సంఖ్య 15, 887కు చేరింది.
మూడో రోజు కూడా..
స్పెయిన్‌లో వరుసగా మూడో రోజు తక్కువ మరణాలు నమోదయ్యాయి. ఆదివారం 674 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12,418 మంది ఈ మహమ్మారికి బలైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది.
న్యూయార్క్‌లో...
న్యూయార్క్‌లో మరో 594 మంది కరోనాతో మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 4 వేల మందికి పైగా వైరస్‌కు బలయ్యారు. అయితే గతంతో పోలిస్తే మరణాల సంఖ్య తగ్గినట్లు రాష్ట్ర గవర్నర్ తెలిపారు.
తొలి కరోనా మృతి..
ఇతియోపియాలో తొలి కరోనా మృతి నమోదైనట్లు అధికారులు తెలిపారు. సుమారు 10.5 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఇప్పటి వరకు కేవలం 43 కేసులు నమోదు కావడం గమనార్హం.