నడివయసులో రాత్రి నిద్ర తగ్గితే డిమెన్షియా వంటి తీవ్ర మతిమరపు సమస్యల ముప్పు పెరుగుతుందని బ్రిటన్‌లో నిర్వహించిన దీర్ఘకాల అధ్యయనం హెచ్చరించింది. వయసు మీదపడే క్రమంలో జ్ఞాపక శక్తికి నిద్రకు మధ్య ఉన్న లంకెను ఈ పరిశోధన వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కనీసం 7 గంటలు..
50, 60 ఏళ్ల వయసు వారిలో రాత్రివేళ 6 గంటలకన్నా తక్కువ సమయం నిద్రించేవారికి.. రోజుకు కనీసం ఏడు గంటలు నిద్రపోయేవారితో పోలిస్తే డిమెన్షియా ముప్పు 30 శాతం ఎక్కువని వారు తెలిపారు. సాధారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ రుగ్మత తలెత్తుతుంటుంది. ఇవేవీ లేనివారిలోనూ డిమెన్షియా రావడానికి కారణం.. నిద్రలేమేనని శాస్త్రవేత్తలు వివరించారు. 1985 నుంచి దాదాపు 8వేల మందిపై పరిశోధన చేసిన యూనివర్సిటీ కాలేజీ లండన్ (యూసీఎల్) శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు.
ఇదీ చదవండి: మీకు తెలుసా.. ఇలా చేస్తే చక్కగా నిద్ర పడుతుంది!
ఇదీ చదవండి: చరవాణితో జాగారం.. ఒంటికి హానికరం
అల్జీమర్స్ ముప్పు..
ప్రపంచవ్యాప్తంగా ఏటా అల్జీమర్స్ సహా డిమెన్షియాకు సంబంధించిన కోటి కేసులు వెలుగు చూస్తున్నాయి. సరైన నిద్ర లేకపోవడమే వీరిలో ఎక్కువగా కనిపిస్తున్న లక్షణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. మద్యపానానికి దూరంగా ఉండటం, కంటినిండా నిద్రపోవడం, మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉండటం, పోషకాహారం తీసుకోవడం ద్వారా కూడా వార్ధక్యంలో మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇవీ చదవండి: ఒక్కరోజు నిద్ర లోపిస్తే.. అది పక్కా వచ్చేస్తుంది..!