ప్రార్థనా మందిరాల్లో చిన్నారులపై వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని చర్చిలో లైంగిక వేధింపులపై ఏర్పాటైన స్వతంత్ర కమిషన్ విస్తుపోయే నిజాలు వెల్లడించింది. గడిచిన 70 ఏళ్లలో 3వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంచనా వేసింది. అందులో మూడింట రెండొంతుల మంది మతపెద్దలు ఉన్నారని స్పష్టం చేసింది.
స్వతంత్ర కమిషన్ అధ్యక్షుడు జీన్ మార్క్ సావే.. జర్నల్ డు డిమాంచె వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. చర్చిలో చిన్న పిల్లల లైంగిక వేధింపులపై రెండున్నరేళ్ల పాటు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తి వివరాలను మంగళవారం విడుదల చేస్తామని చెప్పారు. అయితే.. బాధితులు ఎంత మంది ఉంటారనే విషయాన్ని వెల్లడించలేదు సావే. నివేదికలో అన్ని విషయాలు వెల్లడవుతాయన్నారు.
" 1950 నుంచి ఇప్పటి వరకు చర్చీలో పని చేసిన 1,15,00 మంది మతపెద్దలు, ఇతర సిబ్బందిలో సుమారు 3వేల మంది చిన్నారులపై లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు తేలింది. అందులోనూ మూడింట రెండొంతుల మంది డియోసెసన్ ప్రీస్ట్లు ఉన్నారు. "
- జీన్ మార్క్ సావే, స్వతంత్ర దర్యాప్తు కమిషన్ అధ్యక్షుడు
22 కేసులను ప్రాసిక్యూటర్స్కు అప్పగించినట్లు చెప్పారు సావే. నిందితులు బతికి ఉన్న 40కిపైగా పాత కేసులను చర్చి అధికారులకు ఫార్వర్డ్ చేశామన్నారు. 1950 నుంచి 1970 వరకు బాధితుల పట్ల చర్చి పూర్తిగా ఉదాసీనంగా ఉందన్నారు. లైంగిక వేధింపుల సమస్యలకు పరిష్కారం కనుగొనటం, కారణాలను గుర్తించటం, వాటి పరిణామాలను ప్రజలకు తెలియజేయటమే తమ లక్ష్యమని సావే చెప్పారు.
ఇదీ చూడండి:'నా కోరిక తీర్చు.. పరీక్షల్లో మార్కులేస్తా'