ప్రమాదంలో ఉన్న సామాన్యుడిని రక్షించేందుకు ఓ మంత్రి సాహసం చేసి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన రష్యాలోని నోరిల్స్క్ నగరంలో జరిగింది. విపత్తు నిర్వహణ బృందాల శిక్షణ సందర్భంగా మంత్రి యెవ్జెనీ జినిచెవ్ మృతి చెందినట్లు రష్యా విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
"ఆర్కిటిక్ జోన్‌ను విపత్కర పరిస్థితుల నుంచి రక్షించేందుకు అంతర్గత ఏజెన్సీల శిక్షణ సమయంలో ప్రమాదం జరిగి.. మంత్రి యెవ్జెనీ జినిచెవ్(55) ప్రాణాలు కోల్పోయారు. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. "
- విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ.
అయితే.. ప్రమాదంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు మంత్రిత్వ శాఖ.
మరోవైపు.. శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఓ కెమెరామెన్ ప్రమాదవశాత్తు జారిపోయి నీటిలో పడిపోయాడని, అతన్ని కాపాడేందుకు మంత్రి యెవ్జెనీ జినిచెవ్ నీటిలోకి దూకినట్లు స్థానిక మీడియా తెలిపింది. కెమెరామెన్‌ను రక్షించి మంత్రి ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వంలో 2018 నుంచి విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు జినిచెవ్.
ఇదీ చూడండి: అఫ్గాన్ పౌరులపై పాక్ వేటు- దేశం నుంచి బహిష్కరణ