రష్యాలో విమానం గల్లంతైన వ్యవహారం సుఖాంతమైంది. 19 మందితో వెళ్తున్న ఆ లోహ విహంగం అత్యవసరంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిసింది.
ఏఎన్-28 విమానం పడమర సైబీరియాలోని తామస్కే ప్రాంతంలో ప్రయాణిస్తుండగా సంబంధాలు తెగిపోయాయని రష్యా విపత్తు నిర్వహణ శాఖ తొలుత ప్రకటించింది. యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. ఫలితంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విమానం ఏమై ఉంటుందా అని చర్చ జరిగింది.
కాసేపటికే విమానం ఆచూకీ తెలిసినట్లు అధికారులు ప్రకటించారు. రెండు ఇంజిన్లు విఫలమవగా... పైలట్లు చాకచక్యంగా ల్యాండ్ చేశారని తెలిపారు. విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు.