యాపిల్ ఐఫోన్ వాడటం వల్ల తను స్వలింగ సంపర్కుడిగా మారిపోయానని ఆరోపించాడు రష్యాకు చెందిన ఓ వ్యక్తి. తను 'గే'గా మారడానికి యాపిల్ సంస్థ నైతిక బాధ్యత వహించాలని కోర్టుకెక్కాడు. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా 1 మిలియన్ రూబుల్స్(రష్యా కరెన్సీ)ను యాపిల్ సంస్థ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాస్కో కోర్టులో వ్యాజ్యం వేశాడు.
బిట్‌కాయిన్ బదులు "గే కాయిన్"..
"నా స్మార్ట్‌ఫోన్ యాప్ నుంచి బిట్‌కాయిన్ కోసం ఆర్డర్ ఇస్తే 'గే కాయిన్' అనే క్రిప్టో కరెన్సీ వచ్చింది. ప్రయత్నించే వరకు దేనినీ నమ్మొద్దన్న ప్రకటనతో ఈ యాప్‌లో ప్రత్యక్షమైంది. ప్రయత్నించే వరకు దేన్నీ నమ్మొద్దని నేను కూడా ఈ యాప్‌లో స్వలింగ సంపర్కులతో బంధం ఏర్పరుచుకున్నాను. ఇప్పుడు నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇది నా తల్లితండ్రులకు ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లేదు. నా జీవితం నాశనమైపోయింది. నా జీవితం మళ్లీ సాధారణ స్థితికి రాలేకపోవచ్చు. నన్ను ఈ విధంగా ఏమార్చి స్వలింగ సంపర్కానికి ఉసిగొల్పడానికి కారణం ఆపిల్ సంస్థే. ఈ మార్పులు నైతికంగా, మానసికంగా నాకు హాని కలిగిస్తున్నాయి."
-బాధితుడి ఫిర్యాదు సారాంశం
"ఈ కేసు చాలా తీవ్రమైనది. బాధితుడు చాలా క్షోభ అనుభవిస్తున్నాడు. థర్డ్ పార్టీ యాప్‌లను నియంత్రించాల్సిన బాధ్యత యాపిల్ సంస్థపై ఉంది."
-సపిఝట్ గుస్నీవా, బాధితుడి తరఫు న్యాయవాది
యాపిల్ సంస్థ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. సెప్టెంబర్ 20న న్యాయస్థానంలో ఈ ఫిర్యాదు నమోదు కాగా అక్టోబర్ 17న వాదనలు జరగనున్నాయి.