Russia Ukraine conflict: ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం మొదలైందనే వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. తమ దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉక్రేనియన్ విధ్వంసక, నిఘా బృందంపై కాల్పులు జరిపామని.. కాల్పుల్లో ఐదుగురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా తెలిపింది. తమ భూభాగంలోనే ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్లు వెల్లడించింది.
ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా సరిహద్దును దాటేందుకు జరిగిన యత్నాలను అడ్డుకున్నామని రష్యా సైన్యం తెలిపింది. కాల్పుల్లో రష్యన్ సైనికులు ఎవరూ గాయపడలేదని వెల్లడించింది. ఉక్రెయిన్ సాయుధ దళాలు రెండు యుద్ధ వాహనాల్లో రష్యా భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించాయని.. అడ్డుకునేందుకు కాల్పులు జరిపామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కాల్పుల్లో రెండు వాహనాలు ధ్వంసమైనట్లు వెల్లడించింది.
ఖండించిన ఉక్రెయిన్ ఆర్మీ..
రష్యా సైన్యం ప్రకటనను ఉక్రెయిన్ మిలటరీ ఖండించింది. ఉక్రెయిన్ సైనికులు చొరబాటుకు ప్రయత్నించారన్న రష్యా వాదనను తోసిపుచ్చింది. రష్యా- ఉక్రెయిన్ మధ్య ఇటీవల భారీగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయని తెలిపింది. వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న డాన్‌బాస్‌పై దండయాత్ర చేసే ఆలోచన లేదని ఉక్రెయిన్ మరోసారి స్పష్టం చేసింది. తమ సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ అలెక్సీ డానిలోవ్ వెల్లడించారు. తమ సైనికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో తాము కాల్పులకు పాల్పడుతున్నామని రష్యా చేసిన ఆరోపణలను కూడా ఉక్రెయిన్ సైన్యం ఖండించింది. ఉక్రెయిన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తమ సరిహద్దు సైనిక స్థావరం ధ్వంసమైందని అంతకుముందు రష్యా ఆరోపించింది. ఈ ఆరోపణలను ఖండించిన ఉక్రెయిన్.. ఇవి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు రష్యా రూపొందించిన అసత్య వార్తలని తెలిపింది. రష్యా అసత్య వార్తల ప్రచారాన్ని తాము నియంత్రించలేకపోతున్నామని.. రష్యా స్థావరాలపై తాము కాల్పులు జరపలేదని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది.
అమెరికా హెచ్చరికా..
ఉక్రెయిన్ దురాక్రమణ కోసం రష్యా బూటకపు కథనాలను ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేస్తోందని అమెరికా కూడా హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడేందుకే రష్యా ఇలాంటి సాకులను వెతుకుతోందని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఇదీ చూడండి: యుద్ధానికి సై- సైన్యం ఆధ్వర్యంలో ఉక్రెయిన్ పౌరుల సాధన