Russia Ukraine war: ప్రజల్ని సురక్షితంగా తరలించడానికి వీలుగా సోమవారం ఉదయం నుంచి కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా మరోసారి హామీ ఇచ్చినా బాంబుల మోత సాక్షిగా దానికి తూట్లు పడ్డాయి. తరలింపు మార్గాలన్నీ రష్యా, దాని మిత్రపక్షమైన బెలారస్‌ల వైపే ఉండడం మరింతగా విమర్శలకు తావిచ్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మైకొలైవ్ వంటి ఇతర నగరాలపైనా బాంబుల మోత ఏమాత్రం ఆగలేదు. రాకెట్ లాంఛర్లతో నివాస ప్రాంతాలపై సైనిక బలగాలు విరుచుకుపడ్డాయి. దీంతో వరసగా మూడో రోజు కూడా ప్రజల తరలింపులో విఘాతం తప్పలేదు.
మెక్రాన్ అభ్యర్థనతో స్పందించిన రష్యా
కీవ్, ఖర్కివ్, మేరియుపొల్, సుమీ నగరాలకు తాత్కాలిక కాల్పుల విరమణ వర్తిస్తుందని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌తో చర్చలు కూడా జరుపుతామని తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆదివారం పుతిన్‌తో మాట్లాడినప్పుడు చేసిన అభ్యర్థన మేరకు రష్యా ఈ విషయంలో చొరవ చూపింది. ప్రకటన వెలువడిన తర్వాత కూడా సైనిక బలగాలు ఉక్రెయిన్‌లోని కీవ్, మైకొలైవ్ తదితర నగరాల్లో నివాస ప్రాంతాలపై రాకెట్లతో విరుచుకుపడ్డాయి. ఒక్క మేరియుపొల్ నగరంలోనే దాదాపు రెండు లక్షల మంది వేరే ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉన్నారు. సురక్షిత తరలింపులకు ప్రతిపాదించిన మార్గాలన్నీ రష్యా, బెలారస్‌ల వైపే ఉండడం ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెష్‌చుక్ చెప్పారు.

రష్యా విషయంలో అలాంటి షరతు విధించాలి: జెలెన్‌స్కీ
'రష్యాను మరింతగా శిక్షించాలి. చమురు సహా ఆ దేశ ఉత్పత్తులన్నింటినీ ప్రపంచం బహిష్కరించాలి. నాగరక నిబంధనలకు ఆ దేశం కట్టుబడకపోతే వారికి ఎలాంటి వస్తువులు, సేవల్ని నాగరక దేశాలు పంపించకూడదు. అలాంటి షరతు/ నైతిక కట్టుబాటు విధించాలి' అని జెలెన్‌స్కీ వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు. ఇప్పటికైనా తమ గగనతలంపై ఆంక్షలు విధించాలని కోరారు.

ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటన
రష్యా యుద్ధం ప్రారంభించి రోజులు గడుస్తున్నా ఉక్రెయిన్ ప్రతిఘటన కారణంగా పలుచోట్ల ముందుకు వెళ్లలేకపోతోంది. కీవ్‌పై దండెత్తాలనుకున్న సైనిక వాహనాల శ్రేణి కొన్ని రోజులుగా ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. యుద్ధంలో ఇంతవరకు 406 మంది పౌరులు ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస మానవ హక్కుల విభాగం తెలిపింది. దాడుల్లో అనేకచోట్ల భవంతులు పెద్దఎత్తున దెబ్బతింటున్నాయి. నీరు, గ్యాస్, విద్యుత్తు, కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివేవీ ఉక్రెయిన్‌లో అందుబాటులో లేవని అక్కడి నుంచి బయటపడగలిగినవారు చెబుతున్నారు.
షరతులకు అంగీకరిస్తే సైనిక చర్య నిలిపివేత
తమ షరతులకు ఉక్రెయిన్ అంగీకరిస్తే మరుక్షణం సైనిక చర్య నిలిపివేస్తామని రష్యా ప్రకటించింది. ఏ కూటమిలోనూ చేరే ఉద్దేశం లేదని ఆ దేశ రాజ్యాంగంలో సవరణ చేయాలని పట్టుపట్టింది. ఈ విషయాన్ని పుతిన్ పత్రికా వ్యవహారాల కార్యదర్శి దిమిత్రి పెస్‌కోవ్ వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఉక్రెయిన్, తైవాన్ అంశాలను సరిపోల్చలేం'