Russia Ukraine Crisis: దేశంలోకి దూసుకొస్తున్న రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. దీనివల్ల పుతిన్ సేన పెద్ద సంఖ్యలో సైనికులు, ఆయుధ వ్యవస్థలను నష్టపోవాల్సి వస్తోంది. ఇది వారికి మింగుడుపడటంలేదు. గత రెండు రోజుల్లో అడుగు ముందుకు వేయలేని స్థితిని కొన్నిచోట్ల ఎదుర్కొంటున్నారు. ఆక్రమణ కోసం పుతిన్ మోహరించిన 1.5 లక్షల మంది సైనికుల్లో కనీసం సగం మంది ఇప్పటికే ఉక్రెయిన్‌లోకి ప్రవేశించారని అమెరికా రక్షణ శాఖ అంచనావేస్తోంది. అయినా ఆక్రమణ సునాయాసంగా జరగడంలేదు.
ఉక్రెయిన్‌తో పోలిస్తే.. సైనిక సామర్థ్యంపరంగా రష్యాకు స్పష్టమైన ఆధిపత్యం ఉంది. ట్యాంకులు.. యుద్ధవిమానాలు.. బలగాల సంఖ్య.. ఇలా ఏ అంశంలో చూసినా రెండు దేశాలకు పోలికే లేదు. అయితే మాతృభూమి రక్షణకు ప్రతినబూనిన ఉక్రెయిన్ సైనికులు భీకరంగా పోరాడుతున్నారు. ఈ ప్రతిఘటన చాలా బలంగా ఉందని సైనిక నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా తన సైనిక ఆధిపత్యాన్ని రష్యా గట్టిగా చాటలేకపోతోందని విశ్లేషిస్తున్నారు. ఈ పోరులో పుతిన్ సేనకు ప్రాణనష్టం ఎక్కువగానే ఉంది. కొందరు ఖైదీలుగా దొరికిపోతున్నారు. వీరిలో బ్రిగేడ్ కమాండర్ వంటి సీనియర్ అధికారులూ ఉన్నారు. రష్యన్ ఆయుధ సంపత్తి కూడా ధ్వంసమవుతోంది.
అడుగు ముందుకు వేయలేక..
ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేయాలని రష్యా తొలుత ప్రణాళిక రచించింది. శరవేగంగా ఆక్రమణ సాగాలని భావించింది. అయితే ఉక్రెయిన్ బలగాల దృఢ ప్రతిఘటనతో గడిచిన 24 గంటల్లో రష్యా పోరు మందగమనంలో సాగుతోంది. ఇప్పటివరకూ ఒక్క నగరాన్ని కూడా పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోలేకపోయింది. కీవ్, ఖర్కివ్ లక్ష్యంగా ముమ్మరం దాడులు జరుగుతున్నప్పటికీ అవి చేజిక్కడంలేదు. ఈ రెండు నగరాలూ రష్యా సరిహద్దులకు చేరువలోనే ఉండటం గమనార్హం. ఇది మాస్కోలో సైనిక వ్యూహకర్తలను చికాకుపరుస్తోంది. దక్షిణ ప్రాంతంలోని మెలిటోపోల్, ఖెర్సాన్ సహా పలు పట్టణాలను తాము చేజిక్కించుకున్నట్లు పుతిన్ సేన చెబుతోంది.
ఎందుకిలా జరిగింది..
2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియాను రష్యా ఆక్రమించిన సంగతి తెలిసిందే. నాడు పుతిన్ సేనకు పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. అవే అంచనాలతో ఇప్పుడు రష్యా యుద్ధానికి దిగి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2014 తర్వాత ఉక్రెయిన్ సైనిక బలగాలు పటిష్ఠంగా తయారైన అంశాన్ని పుతిన్ విస్మరించినట్లు కనపడుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని బలగాలను దించే అవకాశాన్ని ఆయన పరిశీలించే వీలుంది.
మేమే ఆగాం..
అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు తామే యుద్ధాన్ని ఆపినట్లు రష్యా సైన్యం చెబుతోంది. చర్చల కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించింది. శాంతి ప్రయత్నాలకు ఉక్రెయిన్ నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల శనివారం రాత్రి నుంచి పోరు ఉద్ధృతం చేయాలని తమకు ఆదేశాలు అందినట్లు తెలిపింది.
వందల మందిని హతమార్చాం: జెలెన్‌స్కీ
రష్యా సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో జెలెన్‌స్కీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. "మన సరిహద్దులు దాటి లోపలికి వచ్చిన వందల మంది రష్యన్ సైనికులు హతమయ్యారు. మనకూ నష్టం జరుగుతోంది. శత్రు దురాక్రమణను ఉక్రెయిన్ వీరోచితంగా తిప్పికొడుతోంది" అని ఆయన ఒక వీడియో సందేశమిచ్చారు.
రష్యాలో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు
ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టాలన్న పుతిన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రష్యాలోని వివిధ నగరాల్లో ప్రజలు గత కొన్ని రోజులుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా ఇవి కొనసాగాయి. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వందలాదిగా గుమికూడిన ప్రదర్శనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ నిరసనలను కఠినంగా అణిచివేస్తున్నారు. యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు ఇప్పటివరకు 45 నగరాల్లో 1475 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
బెర్లిన్‌లోనూ..
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను నిరసిస్తూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఆదివారం సుమారు లక్ష మంది ఆందోళనకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు తెలిపారు. ముందుగా సెంట్రల్ బెర్లిన్‌లోని బ్రండెన్‌బర్గ్ గేట్ దగ్గర ప్రదర్శన ఉంటుందని అనుకున్నామని, తర్వాత ఆ ప్రాంతం మొత్తం ఆందోళనకారులతో నిండిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో చిన్నారులతో సహా అనేక కుటుంబాలు పాల్గొన్నాయని, శాంతియుతంగా కొనసాగిందని చెప్పారు.
ఇవీ చూడండి:
ఉక్రెయిన్ కొత్త వ్యూహం.. పుతిన్ 'అణు' ప్రకటనపై నాటో ఆందోళన!
రష్యాకు వ్యతిరేకంగా యూఎన్ఎస్సీలో తీర్మానం- మరోసారి ఓటింగ్‌కు భారత్ దూరం