Russia-Ukraine crisis: ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భారీగా బలగాలను మోహరిస్తోంది. ఈ క్రమంలో నాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు మద్దతుగా తూర్పు యూరప్ సముద్ర జలాల్లోకి మరిన్ని యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపుతోంది. అలాగే.. అదనపు బలగాలను స్టాండ్‌బైగా ఏర్పాటు చేసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది.
ఈ నిర్ణయం.. బాల్టిక్ సముద్ర ప్రాంతంలో తమ యుద్ధ నిరోధక సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది 30 దేశాల మిలిటరీ కూటమి నాటో. బాల్టిక్ సముద్ర ప్రాంతంలోకి ఓ యుద్ధ నౌకను పంపుతోంది డెన్మార్క్. అలాగే లిథువేనియాలో ఎఫ్-16 యుద్ధ విమానాలను మోహరిస్తోంది.
మరోవైపు.. నాటో అదనపు బలగాలకు పలు యుద్ధనౌకలను అందిస్తోంది స్పెయిన్. ఇందులో భాగంగానే బల్గేరియాకు పలు ఫైటర్ జెట్స్‌ను పంపుతోంది. స్పెయిన్‌తో పాటు బల్గేరియాకు బలగాలను పంపేందుకు సిద్ధమని ఫ్రాన్స్ ప్రకటించింది.
"అన్ని భాగస్వామ్య దేశాల భద్రత కోసం నాటో నిరంతరం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని దేశాల భద్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. మా సమ్మిళిత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటూనే.. మా భద్రత, పర్యావరణానికి హాని కలిగించే చర్యలకు తగిన విధంగా స్పందిస్తాం."
- జెన్స్ స్టోల్టెన్బెర్గ్, నాటో సెక్రెటరీ జనరల్.
ఈయూ మద్దతు..
ఉక్రెయిన్‌కు మద్దతుగా ధృడ సంకల్పాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు ఐరోపా దేశాల విదేశాంగ మంత్రులు. తమ తీర ప్రాంతంలో రష్యా వార్ గేమ్స్ సరికాదని ఐర్లాండ్ హెచ్చరించిన క్రమంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా అన్ని దేశాలు తమ సమైఖ్యతను చాటిచెప్పినట్లయింది.
" ఐరోపా సమాఖ్యలోని సభ్య దేశాలు కలిసికట్టుగా ఉన్నాయి. అమెరికాతో బలమైన భాగస్వామ్యంతో.. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై గతంలో ఎన్నడూ లేని విధంగా మా సమైఖ్యతను చాటుకుంటున్నాం. "
- జోసెప్ బొరెల్, ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్.
అమెరికా దారిలోనే నడుస్తూ.. ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కి రప్పిస్తారా? అని అడగగా.. అలా చేయబోమని చెప్పారు జోసెప్. ఆ నిర్ణయంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో మాట్లాడతామన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: