Russia-Ukraine crisis: ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే క్రమంలో ఆ దేశంలోని ప్రధాన నగరాలపై రష్యా సేనలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నాయి. బాంబులు, క్షిపణులతో నివాస భవనాలపై దాడులకు తెగబడుతూ మారణకాండ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మేరియుపోల్ నగరంలోని పరిస్థితులు హృదయవిదారకంగా మారాయి. శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. ఈ విధ్వంసకాండలో ఆ నగరంలో ఇప్పటివరకు దాదాపు 2,500 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ వెల్లడించారు. మేరియుపోల్‌కు చేరుకునే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గడిచిన రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. నగరంలో దాడులు మొదలైన 12 రోజుల్లో 1500లకు పైగా జనం మృత్యుఒడికి చేరినట్లు ఉక్రెయిన్ విదేశాంగమంత్రి దిమిత్రో కుబేలా రెండు రోజుల క్రితం వెల్లడించారు. మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్ చేశారు. కాగా మరణాల సంఖ్య ప్రస్తుతం 2500కు చేరినట్లు అధ్యక్ష సలహాదారు స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను కైవసం చేసుకునే దిశగా రష్యా తన దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే సోమవారం స్థానికంగా ఓ నివాస భవనంపై జరిపిన వైమానిక దాడిలో దాదాపు ఇద్దరు మృతి చెందారని ఉక్రెయిన్ అత్యవసర సేవావిభాగం తెలిపింది. పదికిపైగా గాయపడ్డారని వెల్లడించింది. దీంతోపాటు దాడుల కారణంగా ఇక్కడి అంటోనోవ్ ఏవియేషన్ ఇండస్ట్రీ పార్క్ మంటల్లో చిక్కుకుంది.
ఇదీ చూడండి: 'నాతో ఫైట్‌కు రెడీనా'.. పుతిన్‌కు మస్క్ సవాల్